Share News

దిత్వాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:43 AM

దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రెండు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపుహాలులో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు.

దిత్వాపై అప్రమత్తంగా ఉండాలి

- జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

- ధాన్యం గోడౌన్‌లకు తరలించండి

- అధికారులు అందుబాటులో ఉండాలి

- కలెక్టర్‌ బాలాజీ

మచిలీపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రెండు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపుహాలులో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే వరి కోత కోసిన ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. మొంథా తుఫాను సమయంలో తీసుకున్న జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. పొలాల్లో ధాన్యం రాశులుగా పోసి ఉంటే రైతులకు టార్పాలిన్‌లను అందజేయాలని ఆదేశించారు. తుఫాను వల్ల ధాన్యం దెబ్బతింటుందనే భయంతో రైతులు ధాన్యం పక్వానికి రాకుండానే కోతలు కోస్తున్నారని, అలా కోయవద్దని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కోత కోసిన ధాన్యం మిల్లులు, మార్కెట్‌ యార్డులు, పీఏసీఎస్‌లకు చెందిన గోడౌన్‌లకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన చోట్ల డ్రెయినేజీల్లో పూడిక తీసేందుకు యంత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

55 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తి

సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ మాట్లాడుతూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి డివిజన్‌ స్థాయి వరకు అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో 1.55 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా, ఇప్పటి వరకు 55 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయని చెప్పారు. 1.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు మూడు వేలకుపైగా వాహనాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఫర్హీన్‌ జాహిద్‌, డీఆర్‌వో కె.చంద్రశేఖరరావు, ఏఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:44 AM