Share News

బీసీలను బలహీన వర్గాలు అనడం సరికాదు: మాధవ్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:35 AM

బీసీలను బలహీన వర్గాలు అనడం సరికాదు. ఈ దేశంలో అత్యంత బలమైన వర్గం బీసీలే. స్వతంత్ర భారతావని వందేళ్లు పూర్తి చేసుకొంటున్న తరుణంలో...

బీసీలను బలహీన వర్గాలు అనడం సరికాదు: మాధవ్‌

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘బీసీలను బలహీన వర్గాలు అనడం సరికాదు. ఈ దేశంలో అత్యంత బలమైన వర్గం బీసీలే. స్వతంత్ర భారతావని వందేళ్లు పూర్తి చేసుకొంటున్న తరుణంలో బీసీ అనే పదానికి ఉన్న భావనలో మార్పు రావాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ వ్యాఖ్యానించారు. బీసీ వర్గానికి చెందిన మాధవ్‌ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత విశ్వకర్మ జయంతి, సృష్టి-స్ఫూర్తి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ సంఘాల నేతలు కేశన శంకర్రావు నేతృత్వంలో గురువారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. మాధవ్‌ మాట్లాడుతూ... ‘దేశంలో 50 శాతానికి పైగా బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిన బీజేపీ... ప్రధాన మంత్రి స్థానానికి బీసీని(నరేంద్ర మోదీ) ఎంపిక చేసింది. బీసీ వర్గాలకు అత్యంత చేరువగా బీజేపీ ఉంటుంది. అందులోనూ బాగా వెనుకబడ్డ బీసీల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తాం’ అని మాటిచ్చారు.


ప్రతి ఇంటా స్వదేశీ మన బాధ్యత: డిప్యూటీ సీఎం

స్వదేశీ వస్తువులు వినియోగించాలన్న చైతన్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మాధవ్‌ విజ్ఞప్తి చేశారు. ‘ఇది మనందరి బాధ్యత.. తప్పకుండా చేద్దాం.. ఇప్పుడే నా సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తా’ అంటూ పవన్‌ స్పందించారు. గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ను మాధవ్‌, బీజేపీ సంఘటనా మంత్రి మధుకర్‌ తదితర బీజేపీ నేతల బృందం కలిసింది. విదేశీ పన్నులతో అప్రమత్తమైన భారత్‌... స్వదేశీ ఉద్యమాన్ని సెప్టెంబరు 25(పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి)న దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘ఇంటింటా స్వదేశీ... ప్రతి ఇంటా స్వదేశీ’ అంటూ చేస్తున్న ప్రచారంలో పాల్గొనవలసిందిగా పవన్‌ను బీజేపీ నేతలు కోరారు. ‘ఇంటింటా స్వదేశీ... ప్రతి ఇంటా స్వదేశీ’ స్టిక్కర్‌ను ఆవిష్కరించిన పవన్‌.. మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందన్నారు.

సారాయి చరిత్ర జగన్‌ కుటుంబానిదే: నాగోతు

సారాయి వ్యాపారం, ఎర్రచందనం స్మగ్లింగ్‌ వంటి చరిత్ర జగన్‌ కుటుంబానిదేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు విజయవాడలో అన్నారు. ‘అక్రమార్జనకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌. కల్తీ మద్యం సరఫరా చేసి 30 వేల మంది చావుకు కారణమయ్యారు. జయచంద్రారెడ్డి గురించి ఎవరినడిగినా పెద్దిరెడ్డి మనిషే అని చెబుతారు. కల్తీ మద్యంలో జోగి రమేశ్‌ కుట్ర వెలుగులోకి వచ్చింది. దీంతో దిక్కుతోచని జగన్‌ వైద్య కళాశాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని చెప్పారు.

Updated Date - Oct 24 , 2025 | 04:36 AM