Local Body Elections: షెడ్యూల్ ప్రకారమే స్థానికం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:23 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలోనే అంటే వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జరిగే అవకాశాలున్నాయి.
వచ్చే సెప్టెంబరు-అక్టోబరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
పంచాయతీలకు మాత్రం టెన్త్ పరీక్షల తర్వాత
ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్లే కీలకం
34 శాతానికి పెంచుతామని కూటమి హామీ
అయితే 50శాతం మించరాదని తేల్చిచెప్పిన సుప్రీం
‘ట్రిపుల్ టెస్ట్’ పాటించాల్సిందేనని స్పష్టీకరణ
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించే చాన్సు
అధ్యయనానికి 3 నెలలు పట్టే అవకాశం
మార్చిలో ముగియనున్న ఎస్‌ఈసీ నీలం పదవీకాలం
కొత్త కమిషనర్ వచ్చాకే ఎన్నికలపై కసరత్తు?
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలోనే అంటే వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జరిగే అవకాశాలున్నాయి. అయితే వచ్చే మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనుండడమే ఇందుకు కారణం. ఏ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలన్నా బీసీ కులాల జనాభా నిర్ధారణ జరగాలి. ఇందుకు డెడికేషన్ కమిషన్‌ను నియమించాల్సి ఉంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ బీసీల కులగణన చేపట్టి.. ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎంత శాతం కోటా బీసీలకు కేటాయించాలో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ప్రకారమే బీసీ రిజర్వేషన్‌ను సర్కారు ఖరారుచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే నెలలో ఈ కమిషన్‌కు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించే వీలుంది. బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీని అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నా.. ఆచరణలో మాత్రం కష్టసాధ్యమే. ఎందుకంటే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తెలంగాణ, మహారాష్ట్రల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును ఇటీవల కొట్టివేసింది కూడా. ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు ‘ట్రిపుల్ టెస్ట్’ ఫార్ములా అనుసరించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
దీనిప్రకారం.. ఓబీసీ కులాల వెనుకబాటుతనంపై లోతైన అధ్యయనానికి రాష్ట్రప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలి. కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని సర్కారు ఖరారుచేయాలి. ఇదే సమయంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించకుండా చూడాలి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో నియమించే డెడికేషన్ కమిషన్ చైర్మన్, సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అభిప్రాయ సేకరణ జరిపి.. ఓబీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి.. రిజర్వేషన్లపై నివేదిక సమర్పిస్తే.. ప్రభుత్వం దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24 శాతం కోటా అమలవుతోంది. మరో పది శాతం పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకుంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది. పొరుగున ఉన్న తెలంగాణలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వానికీ ఇదే ఎదురైంది. కోటా 50 శాతానికి మించితే నామినేషన్ల ప్రక్రియను రద్దుచేస్తానని కోర్టు హెచ్చరించింది కూడా. అంటే మన రాష్ట్రం కూడా బీసీలకు పాత రిజర్వేషన్‌తోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సెప్టెంబరు వరకు..: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరు 23, 24 తేదీలతో ముగుస్తుంది. బీసీ కులగణన చేపట్టాలంటే ఎంతలేదన్నా మూడు నెలల సమయం పడుతుంది. జనవరిలో ఏర్పాటయ్యే డెడికేషన్ కమిషన్ ఆరు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి నివేదిక అందించినా.. ఆ వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. సెప్టెంబరు-అక్టోబరుల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీల పాలకవర్గాలకు వచ్చే మార్చి నెలాఖరు వరకు గడువుంది. వీటికీ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాత రిజర్వేషన్లతో ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినా.. మార్చిలోపు నిర్వహించడం కష్టం. ఎందుకంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 16న ప్రారంభమై 31వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలు జరుగుతుండగా.. గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడం కుదరదు.
పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు..!
కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతానికి పెంచుతామని పదే పదే చెబుతున్నారు. అందుకు వీలుకాని పరిస్థితుల్లో పార్టీపరంగా కోటా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా బీసీలను సంతృప్తిపరచవచ్చని అనుకుంటున్నారు. పాత రిజర్వేషన్లు అమలుచేసినా సుప్రీంకోర్టు నిర్దేశిత ‘ట్రిపుల్ టెస్ట్’ను పాటించాల్సిందే. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు 24 శాతం కోటాతోనే ఎన్నికలకు వెళ్లింది. అయితే అప్పట్లో ట్రిపుల్ టెస్ట్ నిబంధనలపై ఎవరూ కోర్టుకెళ్లకపోవడంతో ఎన్నికలు అడ్డంకులు లేకుండా జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీలకు ఎంత కోటా అమలు చేసినా.. ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు పాటించాల్సిందే. అలా కాకుండా ముందుకెళ్తే ఎవరైనా కోర్టు కెళ్తే మళ్లీ బ్రేక్ పడే అవకాశముందని అంటున్నారు.
కొత్త కమిషనర్ రావాలి!
ఇంకోవైపు.. ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నీలం సాహ్ని పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఆమె స్థానంలో నియమితులయ్యే కొత్త కమిషనర్ స్థానిక ఎన్నికల కసరత్తు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.