Share News

BC Janardhan Reddy: రాష్ట్రంలో ఆధునిక రహదారులు

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:10 AM

అభివృద్ధి చెందిన దేశాల్లోని రహదారులకు దీటుగా మన రాష్ట్ర రహదారులను తీర్చదిద్దుతామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆ దిశగా సీఎం చంద్రబాబు సరికొత్త టెక్నాలజీ కోసం సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు.

BC Janardhan Reddy: రాష్ట్రంలో ఆధునిక రహదారులు

  • డెన్మార్క్‌ అస్ఫాల్ట్‌ టెక్నాలజీతో రోడ్లు

  • నంద్యాల జిల్లాలో ప్రయోగాత్మకంగా ..

నంద్యాల, జూలై 4(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చెందిన దేశాల్లోని రహదారులకు దీటుగా మన రాష్ట్ర రహదారులను తీర్చదిద్దుతామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆ దిశగా సీఎం చంద్రబాబు సరికొత్త టెక్నాలజీ కోసం సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. డానిష్‌ అస్ఫాల్ట్‌ రీ-ఇన్ఫోర్సింగ్‌ టెక్నాలజీతో రూపొందించే ఆధునిక రోడ్ల నిర్మాణం రాష్ట్రంలోనే తొలిసారిగా శుక్రవారం ఆయన ప్రారంభించారు. నంద్యాల జిల్లా సంజామల మండలంలోని ముదిగేడు-సంజామల రోడ్డు నిర్మాణ పనుల్లో డెన్మార్క్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ పనుల ప్రారంభ కార్యక్రమానికి మంత్రితో పాటు డెన్మార్క్‌ సంస్థ ప్రతినిధులు మైఖేల్‌, డేవిల్‌, జోస్‌ సెబాస్టియన్‌ హాజరయ్యారు. నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న రహదారిని మంత్రి పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు. ఈ అధునాతన టెక్నాలజీని బ్రిటన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు, జర్మనీలోని ఏ7 మోటార్‌ వే వంటి ప్రాజెక్టుల్లో విజయవంతంగా ఉపయోగించారన్నారు. ఈ టెక్నాలజీ రోడ్లకు కిలోమీటరుకు రూ.28 లక్షలు ఖర్చు అవుతుందని, పదేళ్లకు పైగా రహదారి దెబ్బతినే అవకాశమే ఉండదని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదేతరహా రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం ఈ తరహా రహదారులు తట్టుకుని దీర్ఘకాలం మన్నికగా ఉంటాయన్నారు. అస్సాం, గుజరాత్‌ వంటి ప్రాంతాల్లో నిరంతరం వర్షాలు పడుతున్నా ఈ టెక్నాలజీతో వేసిన రోడ్లు చెక్కుచెదరలేదన్నారు.

అస్ఫాల్ట్‌ రోడ్ల నిర్మాణం ఇలా..

తారు రోడ్లకు ఆధునిక రూపం అస్ఫాల్ట్‌ టెక్నాలజీ రోడ్లు. అస్ఫాల్ట్‌(ఓ రకమైన పెట్రోలియం ఉత్పత్తి) మిశ్రమాన్ని పలు రకాలుగా తయారు చేస్తారు. సాధారణంగా స్టోన్‌ క్రష్‌, గ్రావెల్‌, ఇసుక వంటి వాటితో అస్ఫాల్ట్‌ బైండర్‌ను కలుపుతారు. నాణ్యత మరింత పెరగడానికి అరమిడ్‌, పాలియోలెఫిన్‌ వంటి కొన్ని ఫైబర్లలను ఆ మిశ్రమానికి జోడిస్తారు. ఈ రోడ్డు నిర్మాణం చేసే ప్రాంతంలో గట్టిగా ఉండేలా బేస్‌ను రూపొందిస్తారు. దానిపై నిర్ధిష్ట వేడిగా ఉన్న అస్ఫాల్ట్‌ మిశ్రమాన్ని పోసి రోలర్లతో చదును చేస్తారు. దీంతో అది గట్టి పడుతుంది. ఇది సాధారణ తారు రోడ్డు కన్నా చదునుగా ఉంటుంది.

Updated Date - Jul 05 , 2025 | 04:12 AM