Share News

ఉద్యోగాలకు బేరం!

ABN , Publish Date - May 02 , 2025 | 12:44 AM

డిస్టిక్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీ వ్యవహారంలోకి రాజకీయ దళారులు రంగ ప్రవేశం చేశారు. డీసీహెచ్‌ఎస్‌ తమకు తెలుసునని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సిఫార్సు లేఖలు ఇప్పిస్తామని ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు బేరాలు మాట్లాడుతున్నారు. దళారులతో తీరుతో తమకు అన్యాయం జరుగుతుందని భావించిన మెరిట్‌ అభ్యర్థులు ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో డీసీహెచ్‌ఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది.

ఉద్యోగాలకు బేరం!

- డీసీహెచ్‌ఎస్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో 33 పోస్టుల భర్తీకి నెల కిందట నోటిఫికేషన్‌

- దరఖాస్తు చేసుకున్న 738 మంది నిరుద్యోగులు

- వెబ్‌సైట్‌లో సీనియారిటీ లిస్టు.. అభ్యంతరాల స్వీకరణ

- ఇదే అదనుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారుల చేతివాటం

- ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు

- ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేసిన మెరిట్‌ అభ్యర్థులు

డిస్టిక్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీ వ్యవహారంలోకి రాజకీయ దళారులు రంగ ప్రవేశం చేశారు. డీసీహెచ్‌ఎస్‌ తమకు తెలుసునని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సిఫార్సు లేఖలు ఇప్పిస్తామని ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు బేరాలు మాట్లాడుతున్నారు. దళారులతో తీరుతో తమకు అన్యాయం జరుగుతుందని భావించిన మెరిట్‌ అభ్యర్థులు ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో డీసీహెచ్‌ఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది.

(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం టౌన్‌):

డీసీహెచ్‌ఎస్‌ (డిస్టిక్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌) పరిధిలో గుడివాడ ఏరియా ఆస్పత్రి, అవనిగడ్డ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, చల్లపల్లి, గూడూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఖాళీగా ఉన్న 33 పోస్టులకు నెల కిందట నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ పోస్టులకు 738 దరఖాస్తులు వచ్చాయి. ఒక బయోమెడికల్‌ ఇంజనీరు పోస్టుకు 22 మంది, రెండు రేడియోగ్రాఫర్‌ పోస్టులకు 45 మంది, ఒక గ్రేడ్‌-2 లాబ్‌ టెక్నిషియన్‌ పోస్టుకు 40 మంది, మూడు ఆడియో మెట్రికన్‌ పోస్టులకు తొమ్మిది మంది, ఒక గ్రేడ్‌-2 కౌన్సిలర్‌ పోస్టుకు 14 మంది, మూడు ఓటీ అసిస్టెంట్‌ పోస్టులకు 29 మంది, రెండు మెడికల్‌ రికార్డు అసిస్టెంట్‌ పోస్టులకు 124 మంది, 16 ఎంఎన్‌వో పోస్టులకు 317 మంది, రెండు ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులకు 124 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాజకీయ దళారీలు బయలు దేరారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలను దరఖాస్తుదారులకు చూపిస్తూ డబ్బులు గుంజుతున్నట్టు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు బేరాలు మాట్లాడుతున్నట్టు సమాచారం. బందరు మూడవ డివిజన్‌కు చెందిన ఒక అధికార పార్టీ యువ నాయకుడు ఈ తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇతని ఆగడాలను ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు కొందరు తీసుకుని వెళ్లినట్టు సమాచారం.

డీసీహెచ్‌ఎస్‌కు ఆకాశరామన్న ఉత్తరాలు

రాజకీయ దళారుల బేరాలపై డీసీహెచ్‌ఎస్‌ ఏ.వి.శేషుకుమార్‌కు పలువురు అభ్యర్థులు ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో పనిచేసే గుమస్తాలు కూడా ఉద్యోగాలిప్పిస్తాం.. ఎంత డబ్బు ఇస్తారని అడుగుతున్నారని తెలిపారు. అర్హులైన తమకు న్యాయం చేయాలని కోరారు.

దళారుల మాటలు నమ్మవద్దు

పలువురు అభ్యర్థుల నుంచి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చిన మాట వాస్తవమే. కొందరు అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా జత చేశారు. 33 పోస్టులకు 738 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మెరిట్‌, అనుభవం, రోస్టర్‌ను పాటిస్తూ వెబ్‌సైట్‌లో సీనియారిటీ లిస్టు పొందుపరిచాం. ఏమైనా అభ్యంతరాలుంటే నేరుగా కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చు. దళారుల మాటలు నమ్మవద్దు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మెరిట్‌ జాబితాను అనుసరించి కలెక్టర్‌ అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అయితే ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తుంది.

- ఏ.వి.శేషుకుమార్‌, డీసీహెచ్‌ఎస్‌, మచిలీపట్నం

Updated Date - May 02 , 2025 | 12:44 AM