Nirmala Sitharaman: బ్యాంకులొస్తున్నాయ్ అమరావతికి
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:12 AM
రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు.
28న ఒకేసారి 25 ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకులకు శంకుస్థాపన
నేలపాడులో ఆర్బీఐ భవన నిర్మాణానికీ శ్రీకారం
కేంద్ర మంత్రి నిర్మలచేతుల మీదుగా భూమిపూజ
గుంటూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న నేలపాడులో ఆర్బీఐకి కేటాయించిన 3 ఎకరాల స్థలంలో భూమిపూజ చేయనున్నారు. అలాగే, మరో 25 జాతీయ, ప్రైవేటు, ప్రభుత్వరంగ బ్యాంకుల నూతన భవనాలకు ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన షెడ్యూల్ విడుదలయింది. వాస్తవానికి గతనెల 28వ తేదీన ఈ శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించాలని ఏపీసీఆర్డీఏ భావించినా, మొంథా తుఫాను ప్రభావంతో వాయిదా పడింది. కాగా, ఈ నెల 28న శంకుస్థాపనల కార్యక్రమాల సందర్భంగా సీఆర్డీఏ కార్యాలయం వద్ద భారీ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతారు.