Share News

AP CM Urges Centre for 5 Year Support: ఒక్క ఐదేళ్లు సహకరించండి!

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:52 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక్క ఐదేళ్లు మీరు సహకరించండి.. ఆ తర్వాత మేం నిలదొక్కుకోవడమే కాదు....

AP CM Urges Centre for 5 Year Support: ఒక్క ఐదేళ్లు సహకరించండి!

  • ఆ తర్వాత దేశ ఆర్థిక ప్రగతికివెన్నెముకగా నిలుస్తాం

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం వినతి

  • రాష్ట్రానికి నిర్మలా సీతారామన్‌ చేయూత

  • నల్లమలసాగర్‌కూ సహకరించాలి: సీఎం

  • బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపనతోఆర్థిక ప్రగతికి పునాది: పవన్‌ కల్యాణ్‌

  • ఆపేయడానికి అమరావతి స్విచ్‌ కాదు: లోకేశ్‌

గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక్క ఐదేళ్లు మీరు సహకరించండి.. ఆ తర్వాత మేం నిలదొక్కుకోవడమే కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి కూడా వెన్నెముకగా నిలుస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. సీఎం, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, పి.నారాయణ, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజుతో కలిసి నిర్మలా సీతారామన్‌ 13 కేంద్ర బ్యాంకులు, 2 బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు (తద్వారా అన్ని బ్యాంకు సర్వీసులూ ఒకేచోట ఉండేలా బ్యాంకింగ్‌ స్ట్రీట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది). ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌, ప్రధాని మోదీ ఆర్థిక చేయూతనిచ్చి ఊపిరి పోశారని తెలిపారు. ‘ఇప్పటికైతే బయటపడ్డాం. కానీ ఇంకా నిలదొక్కుకోవలసి ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. 2027 మార్చినాటికి పోలవరం.. 2028 నాటికి అమరావతిని పూర్తి చేస్తాం. నా కంటే వేగంగా కేంద్ర మంత్రి నిర్మల స్పందించి అమరావతికి రూ. 15 వేల కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించి పనులు మొదలుపెట్టాలని చెప్పారు. ఆ ఐదేళ్లలో పోలవరం ఆగిపోయి, డయాఫ్రం వాల్‌ దెబ్బతిని.. ఆశలు వదులుకునే దశలో ఉన్న మనకు రూ.1,000 కోట్లు తక్షణ సహాయం అందజేసి డయాఫ్రం వాల్‌ పనులు మొదలుపెట్టించారు. ఇప్పుడు అమరావతి కోసం దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం ఒక చోటకు తెచ్చారు’ అని కొనియాడారు. నాడు దేశంలోనే తొలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను సైబరాబాద్‌లో నిర్మించానని, మళ్లీ ఇప్పుడు అమరావతిలో ‘బ్యాంకింగ్‌ స్ట్రీట్‌’ను కూడా తానే నిర్మిస్తుండడం, అందుకు కేంద్ర ఆర్థిక మంత్రి తోడ్పాటునివ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. అమరావతి ఆర్థిక నగరం చాలా ప్రత్యేకమైనదని, బ్యాంకు సేవలన్నీ ఒకే చోట ఉండేలా చేయడంతోపాటు, వారికి అవసరమైతే ప్రత్యేక టవర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సులభతర లావాదేవీలను అందించాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్రం సహకారంతోనే విశాఖ ఉక్కు నిలిచిందని, అతిపెద్ద డేటా సెంటర్‌ రాష్ట్రానికి వచ్చిందని, రాయలసీమలో 9 జిల్లాల్లో హార్టికల్చర్‌ హబ్‌ను అభివృద్ధి చేసేందుకు వీలైందని చంద్రబాబు చెప్పారు.


అది మాత్రమే సరిపోదని.. పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన ప్రాజెక్టుకు కూడా నిర్మలా సీతారామన్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని, అందుకు సహకరించాలని, రాజధాని రైతులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు మరో రెండేళ్లు పొడిగించాలని, అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోయేందుకు అన్నివిధాలా సహకరించాలని అభ్యర్థించారు. 2014లో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల నేతృత్వంలో ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, వచ్చే ఏడాదికి మూడో ఆర్థిక వ్యవస్థగా, 2038 నాటికి రెండో ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ప్రపంచ నంబర్‌వన్‌ ఎకానమీగా ఎదుగుతుందని, అందులో ఏపీ గణనీయమైన పాత్ర పోషించబోతోందని చెప్పారు. స్పేస్‌ సిటీ, డ్రోన్‌ సిటీ, గ్రీన్‌ ఎనర్జీ, సెమీ కండక్టర్స్‌ సిటీలను ప్రారంభిస్తున్నామని, జనవరి నుంచి క్వాంటం కంప్యూటర్‌ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అమరావతిలో గ్రీన్‌బిల్డింగ్స్‌, గ్రీన్‌ ఎనర్జీ, కావలసినంతనీరు ఉందని.. రాబోయే రోజుల్లో అద్భుతమైన కాంబినేషన్‌ ఉన్న నగరంగా ఉండబోతోందన్నారు.

2.jpg

ఆర్థిక ప్రగతికి పునాది

  • డిప్యూటీ సీఎం

రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సాయం మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రోత్సాహం విలువైనదని సభలో అన్నారు. ‘అమరావతిలో బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపనతో ఆర్థిక ప్రగతికి పునాది పడింది. రాష్ట్ర ప్రగతి కోసం వేసే ప్రతి అడుగుకు కేంద్రం సహకరిస్తోంది. సహకారం కాగితాలకు పరిమితం కాకుండా, కార్యరూపం దాల్చేందుకు తోడ్పడుతోంది. బ్యాంకు స్ట్రీట్‌ విధానం వల్ల పెట్టబడిదారుల విశ్వాసం పెరిగి, అమరావతి అభివృద్ధికి బాటలు పడతాయి’ అని ఆకాంక్షించారు.

4.jpg

జై అమరావతి అంటే జైల్లో పెట్టారు: లోకేశ్‌

మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాటను, ఒక వ్యక్తి రూ.700 కోట్లతో ఇల్లు కట్టుకోవడాన్ని కళ్లారా చూశామని లోకేశ్‌ అన్నారు. ‘భూములిచ్చిన రైతులు జై అమరావతి అంటే జైల్లో పెట్టారు. అయినా వెనక్కి తగ్గకుండా 1631 రోజులు ఉద్యమం చేసి.. 270 మంది బలిదానంతో అమరావతిని రక్షించుకున్నారు. ఆపేయడానికి అమరావతి అనేది ఎవరింట్లోనూ స్విచ్‌ కాదు. అది పవర్‌ఫుల్‌. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి. దానిని కదిలించడం ఎవరి తరమూ కాదు’ అని స్పష్టంచేశారు. నిర్మలా సీతారామన్‌ స్త్రీశక్తికి ప్రతిరూపమని.. ఆమె చేయూతతో అమరావతి నిర్మాణం దూసుకుపోతోందని చెప్పారు. మంగళగిరి చేనేత వస్త్రాలను ధరించి ప్రమోట్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

రాజధానిలో కాస్మోస్‌ ప్లానిటోరియం

  • ఆస్ట్రో ఫిజిక్స్‌తో సీఆర్‌డీఏ ఎంవోయూ

నిర్మలా సీతారామన్‌, చంద్రబాబు సమక్షంలో.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌తో సీఆర్‌డీఏ ఎంవోయూ కుదుర్చుకుంది. ఐదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కాస్మోస్‌ ప్లానిటోరియం నిర్మాణానికి ఈ ఒప్పందం జరిగింది. సంస్థ డైరెక్టర్‌ అన్నపూర్ణి సుబ్రమణియం స్వయంగా ఎంవోయూ చేసుకోవడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 29 , 2025 | 04:52 AM