CID DGP Ayyannar: బ్యాంకర్లు సహకరిస్తేనే బాధితులకు న్యాయం
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:18 AM
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు బ్యాంకుల నుంచి పూర్తి సహకారం అవసరమని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు.
దర్యాప్తు సంస్థలు సమన్వయంతో సాగాలి: సీఐడీ డీజీ అయ్యన్నార్
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఆర్థిక మోసాలను అరికట్టేందుకు బ్యాంకుల నుంచి పూర్తి సహకారం అవసరమని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. దర్యాప్తు ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళితేనే ఆర్థిక నేరాలను అరికట్టి, బాధితులకు న్యాయం చేయొచ్చన్నారు. అగ్రిగోల్డ్ కేసుతోపాటు రాష్ట్రంలోని పలు ఆర్థిక నేరాల కేసుల దర్యాప్తుపై గురువారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల సీఐడీ అధికారులు, బ్యాంకర్లు హాజరైన ఈ సమావేశంలో అయ్యన్నార్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసం, ఆర్థిక స్థిరత్వం కోసం పోలీసులకు బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని కోరారు. ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాల బాధితులు హెల్ప్‌లైన్-1930కు ఫోన్ చేస్తే డబ్బు సీజ్ చేసేందుకు అవకాశం ఉంటుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.