Share News

రోడ్డు ప్రమాదంలో బ్యాంకు అధికారి మృతి

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:55 PM

నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి చెన్నమ్మ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై శ్రీచక్ర హాస్పిటల్‌కు ఎదురుగా జరిగిన ప్రమాదంలో బ్యాంకు అధికారి సురేంద్రగౌడు (40) దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదంలో బ్యాంకు అధికారి మృతి

కర్నూలు క్రైం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి చెన్నమ్మ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై శ్రీచక్ర హాస్పిటల్‌కు ఎదురుగా జరిగిన ప్రమాదంలో బ్యాంకు అధికారి సురేంద్రగౌడు (40) దుర్మరణం చెందారు. వివరాలివీ.. సురేంద్రగౌడు బళ్లారి చౌరస్తా సమీపంలో ఉన్న శివరామకృష్ణ నగర్‌లో నివాసముంటున్నారు. బిర్లా కాంపౌండులో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్‌ కార్యాలయంలో డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తన బ్యాంకు కార్యాలయంలో పని చేసే మెసెంజర్‌ రాఘవేంద్రను ఎక్కించుకుని తన బైక్‌పై హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్లే రోడ్డుపై వెళ్తుండగా.. అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌ వీరి బైక్‌ను డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కింద పడగా.. బైక్‌ నడుపుతన్న సురేంద్ర గౌడు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వెనుకాల కూర్చున్న రాఘవేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సురేంద్రగౌడ్‌ భార్య, కొడుకు, కూతురు సంతానం ఉన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్సూరుద్దీన తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 11:55 PM