Share News

Bangladesh Fishermen: సిక్కోలు తీరానికి 13 మంది బంగ్లాదేశీయులు

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:49 AM

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట సముద్ర తీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులు ఆదివారం చేరారు.

Bangladesh Fishermen: సిక్కోలు తీరానికి 13 మంది బంగ్లాదేశీయులు

  • స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం

  • కళింగపట్నం మెరైన్‌స్టేషన్‌కు తరలింపు

ఎచ్చెర్ల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట సముద్ర తీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులు ఆదివారం చేరారు. చేపలవేటకు వచ్చిన వారు సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం, బోటు పాడైపోవడంతో దారి తప్పి ఇక్కడకు చేరినట్టు మెరైన్‌, పోలీసులు గుర్తించారు. మూసవానిపేట తీరం వద్ద సముద్రంలో బోటు లంగరు వేసి ఉండిపోయారు. వీరిని ఆదివారం మధ్యాహ్నం స్థానిక మత్స్యకారులు గమనించి స్థానిక, మెరైన్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందజేశారు. కళింగపట్నం మెరైన్‌ సీఐ బి.ప్రసాదరావు, ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది సముద్ర తీరానికి చేరుకుని మూడు బోట్ల సాయంతో సముద్రంలోనికి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ మత్స్యకారుల వేషధారణ, భాష ఆధారంగా వారంతా బంగ్లాదేశీయులుగా గుర్తించారు. స్థానిక మత్స్యకారులు, పోలీసులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కొద్దిరోజులుగా ఆహారం లేకపోవడం, భయంతో వివరాలు చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. వీరికి స్థానిక మత్స్యకారులు ఆహారం అందించారు. అనంతరం కళింగపట్నం మెరైన్‌ స్టేషన్‌కు తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడికి చేరిన బంగ్లాదేశీయులపై కేసు నమోదు చేస్తున్నట్టు మెరైన్‌ సీఐ ప్రసాదరావు తెలిపారు.

Updated Date - Dec 01 , 2025 | 05:50 AM