Share News

Banana Price Hike: అరటి ధరకు ఊపు

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:06 AM

రాష్ట్రంలో అరటి ధర పుంజుకుంది. కిలో కనీసంగా రూ.10, గరిష్ఠంగా రూ.17కు చేరింది. రాయలసీమ జిల్లాల్లో పండిస్తున్న అరటిని ఉత్తరాది రాష్ట్రాల నుంచి పండ్ల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

Banana Price Hike: అరటి ధరకు ఊపు

  • కిలో కనీసంగా రూ.10, గరిష్ఠంగా రూ.17

  • ఉత్తరాది వ్యాపారుల రాకతో మార్కెట్‌ జోష్‌

  • రాయలసీమ రైతులకు ఊరట

  • గత నెలలో కిలో అరటి రూ.2కు పతనం

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరటి ధర పుంజుకుంది. కిలో కనీసంగా రూ.10, గరిష్ఠంగా రూ.17కు చేరింది. రాయలసీమ జిల్లాల్లో పండిస్తున్న అరటిని ఉత్తరాది రాష్ట్రాల నుంచి పండ్ల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అరటి ధర మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాణ్యత లేని అరటి గత నెలలో కిలో రూ.2కు పడిపోగా.. కాస్త నాణ్యమైన అరటి కిలో రూ.7-8 దాకా పలికింది. దాదాపు నెల రోజుల పాటు ఎగుమతులు మందగించి, ధరలు పడిపోయాయి. ఇప్పుడు ఉత్తరాది వ్యాపారుల రాకతో కనీస ధర కిలోకు రూ.10కి చేరింది. తాజాగా పులివెందుల మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.16-17 దాకా పలికింది. గత నెల 20 నుంచి ఈ నెల 10 వరకు అరటి ధర పతనమైంది. సీమ ప్రాంతం నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి పెద్ద మార్కెట్లకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో అరటి సాగు పెరిగి, నాణ్యమైన సరుకు తక్కువ ధరకు లభించడంతో వ్యాపారులు అక్కడి నుంచే ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అరటికి డిమాండ్‌ లేకుండా పోయింది. ఎగుమతులు నిలిచిపోయి, తక్కువ ధరకు కూడా కొనేనాథుడు లేక రైతులు అరటి గెలలను పశువులకు మేతగా వదిలేయాల్సి వచ్చింది.


రైతుల ఆవేదనపై స్పందించిన సీఎం

దాదాపు నెల పాటు అరటి మార్కెట్‌లో సంక్షోభం నెలకొంది. అరటి రైతుల ఆవేదనపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఉద్యానశాఖ అధికారులను ఉత్తరాది రాష్ట్రాలకు పంపి, వ్యాపారులతో చర్చలు జరిపించారు. డిసెంబరు రెండో వారం నుంచి సీమ అరటిని కొనుగోలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ మేరకు నాలుగైదు రోజుల నుంచి ఉత్తరాది వ్యాపారులు రాయలసీమ మార్కెట్లకు వస్తున్నారు. దీంతో కొనుగోళ్లు సాగుతుండటంతో అన్ని రకాల అరటి పండ్ల ధరలు టన్ను రూ.10 వేల పైనే పలుకుతున్నాయి. గరిష్ఠ ధర రూ.16 వేలు దాటింది. రాష్ట్రంలో లక్షా 30 వేల హెక్టార్లలో అరటి సాగులో ఉండగా, 87 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రాయలసీమ రైతులు గ్రాండ్‌9 రకం అరటిని 34 వేల హెక్టార్లలో పండిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2 లక్షల టన్నుల అరటి ఎగుమతి లక్ష్యంగా పెట్టుకోగా, గత నెల మూడో వారంలో అరటి ధరల సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 70 వేల టన్నుల అరటిని వ్యాపారులు కొనుగోలు చేశారని ఉద్యాన శాఖ డైరెక్టర్‌ కే శ్రీనివాసులు ఆదివారం చెప్పారు. అరటి ధర మరింత పెరుగుతుందని, అరటి మార్కెట్‌ను ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు వివరించారు.


పుంజుకోని రబీ సాగు

అంచనాల్లో 32 శాతం మించని వివిధ పంటల సాగు విస్తీర్ణం’

రాష్ట్రంలో రబీ సాగు మందకొడిగా సాగుతోంది. సీజన్‌ ప్రారంభమై రెండు నెలలైనా.. పంట విస్తీర్ణం 32 శాతం మించలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉండగా, ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా వరి కోతలు ఆలస్యమై, దాళ్వా వరి సాగు ఆలస్యమౌతోంది. మరోవైపు కృష్ణా డెల్టా, సాగర్‌ కుడి కాల్వ కింద వరి సాగుకు నీటి గ్యారెంటీ లేకపోవడంతో రైతులు సందిగ్ధంలో ఉన్నారు. 7.45 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటికి 1.33 లక్షల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. ఈశాన్య రుతుపవనాలు, వరుస తుఫాన్లతో వర్షాలు విస్తారంగా కురిసినా.. మెట్ట ప్రాంతాల్లో చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగు పెద్దగా పుంజుకోలేదు. ప్రస్తుతం చిరుధాన్యాలు 2.97 లక్షల హెక్టార్లకు బదులు 1.21, నూనె గింజలు 1.25 లక్షల హెక్టార్లకు బదులు 0.21, అపరాలు 8.20 లక్షల హెక్టార్లకు బదులు 3.44 లక్షల హెక్టార్లలోనే విత్తనం పడింది. పత్తి, పొగాకు, మిర్చి సాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది.

Updated Date - Dec 15 , 2025 | 04:07 AM