Share News

AP Water Resources Dept: ట్రైబ్యునల్‌ పరిధిలోకి బనకచర్ల రాదు

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:27 AM

గోదావరి జలాలను తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపే అంశం పోలవరం - బనకచర్ల అనుసంధాన పథకంలో లేదని కేంద్రానికి వివరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ సిద్ధమైంది.

AP Water Resources Dept: ట్రైబ్యునల్‌ పరిధిలోకి బనకచర్ల రాదు
Banakacherla Project

  • పూర్తి వరద జలాలతోనే పథకం..

  • 15 ఏళ్ల హైడ్రాలజీ డేటా సిద్ధం చేసిన వాప్కోస్‌

  • మొత్తం 40 ఏళ్ల లెక్కలిస్తాం..

  • గోదావరి జలాలు పెన్నాలో విలీనమవుతాయి

  • కాబట్టి కృష్ణాలోకి గోదావరి నీళ్లు వచ్చే ప్రశ్నేలేదు..

  • అందువల్ల పొరుగు

  • రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కల్లేదు..

  • కేంద్రానికి నివేదించనున్న జల వనరుల శాఖ

అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపే అంశం పోలవరం - బనకచర్ల అనుసంధాన పథకంలో లేదని కేంద్రానికి వివరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బనకచర్ల ప్రతిపాదనను వెనక్కి పంపుతూ.. జలశక్తి శాఖ, ఇతర సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై ‘వాప్కోస్’తో సమగ్ర నివేదికను తయారుచేయించింది. ఈ నివేదిక రెండు రోజుల కిందట (గురువారం) జల వనరుల శాఖకు వాప్కోస్‌ అందజేసింది. ఈ నివేదికనూ .. కేంద్ర సంస్థలు వేసిన కొర్రీలనూ జల వనరుల శాఖ సమగ్రంగా పరిశీలన చేస్తోంది. ప్రతి కొర్రీకీ ఆచి తూచి సమాధానం చెప్పేలా సమగ్ర నివేదికను తయారు చేస్తోంది.

ఆ నివేదికను సోమవారం లేక మంగళవారం కేంద్రానికి సమర్పించాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. రుతుపవనాల సమయంలోను, గోదావరికి వరదలు వచ్చేసమయంలోను పోలవరం దిగువన తీసిన 15సంవత్సరాల డేటా ఆధారంగా 2,842 టీఎంసీలు వరద జలాలేనని గణాంకాలతో సహా తెలియజేయనుంది. 75శాతం నికర జలాల కింద కాళేశ్వరం జీ-0 దాకా 932 టీఎంసీలు, ఇంద్రావతి జీ-11 దాకా 737 టీఎంసీలు , లోయర్‌ గోదావరి జీ-10 దాకా 231 టీఎంసీలు, శబరి దాకా జీ-12లో 383 టీఎంసీలు.... మొత్తం 2,194 టీఎంసీల జలాలు అందుబాటులో ఉంటాయని వివరించనుంది.


కృష్ణాలోకి గోదావరి రాదు..

గోదావరి జలాలు కృష్ణానదిలో కలిస్తే .. గోదావరి వివాద ట్రైబ్యునల్‌ తీర్పునకు లోబడి కృష్ణా జలాల్లో కర్ణాటక, మహారాష్ట్రలకు ఉమ్మడి ఏపీ వాటా ఇవ్వాల్సి వస్తుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహా... పోలవరం అథారిటీ, గోదావరి నదీ యాజమాన్య సంస్థ పేర్కొంది. దీనిపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్ల పఽథకంలో గోదావరి జలాలు కృష్ణా నదిలోకి వెళ్లకుండా సాగర్‌ కుడికాలువపై అక్విడెక్టును నిర్మించి .. బొల్లాపల్లి రిజర్వాయరులోకి.. ఆ తర్వాత బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తామని స్పష్టం చేయనున్నది. పెన్నా బేసిన్‌కు గోదావరి జలాలు వెళ్తున్నందున కృష్ణా-గోదావరి జలాల సంగమానికి ఆస్కారమే ఉండదని, అందువల్ల పొరుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల్లో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 75 శాతం నికర జలాల వినియోగానికి మించి గోదావరి వరద జలాలు ఉన్నాయని తెలపనుంది.

అందువల్లే రోజుకు 2టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని భావిస్తున్నామని వివరించనుంది. డీపీఆర్‌ను సమర్పించే సమయంలో హైడ్రాలజీ మెథడాలజీకి సంబంధించి 40 ఏళ్ల గణాంకాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును మాత్రమే సమర్పించినందున .. వాప్కోస్‌ రూపొందించిన రిపోర్టులో 15 ఏళ్ల లెక్కలను సిద్ధం చేశారు. డీపీఆర్‌ను సమర్పించే సమయంలో 40ఏళ్ల నీటి ప్రవాహ లెక్కలను ఇస్తామని కేంద్రానికి వెల్లడించాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి.. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని కేంద్రానికి జలవనరుల శాఖ స్పష్టం చేయనుంది. పోలవరం పూర్తయ్యాకే బనకచర్లకు అనుమతిస్తామంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చెప్పడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వివరణను సిద్ధం చేసుకుంది. పోలవరం నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే పీపీఏ బాధ్యత వహి ంచాల్సి ఉంటుందని .. అంతకు మించి పీపీఏకు ఎలాంటి అధికారాలూ ఉండవని కూడా స్పష్టంచేస్తోంది.

Updated Date - Jul 13 , 2025 | 09:18 AM