Share News

Project Authority Chairman Atul Jain: బనకచర్ల మా పరిధిలోది కాదు

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:53 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం తమ పరిధిలోకి రాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్‌ అతుల్‌జైన్‌ తెలంగాణకు తేల్చిచెప్పారు.

Project Authority Chairman Atul Jain: బనకచర్ల మా పరిధిలోది కాదు

  • బనకచర్లపై తెలంగాణకు పీపీఏ స్పష్టీకరణ

  • అనుమతి/తిరస్కరణ అధికారం మాకు లేదు

  • వాటిని ప్రస్తావిస్తే మేమేమీ చేయలేం: సీఈవో

  • పోలవరం తొలి దశలో ‘భద్రాచలం’ ముంపుపై కమిటీ

  • కేంద్ర నిధులు వచ్చిన వెంటనే ప్రత్యేక ఖాతాలో జమ

  • ఏపీ ప్రభుత్వానికి సూచన.. డ్యాం పనులపై సంతృప్తి

  • నేడు ప్రాజెక్టు ప్రాంతానికి అతుల్‌ జైన్‌ బృందం

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం తమ పరిధిలోకి రాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్‌ అతుల్‌జైన్‌ తెలంగాణకు తేల్చిచెప్పారు. ఈ పథకానికి అనుమతులు ఇచ్చేందుకు గానీ, తిరస్కరించేందుకు గానీ తమకు అధికారం లేదన్నారు. పరిధిలో లేని ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే తామేమీ మాట్లాడలేమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో పీపీఏ సమీక్షా సమావేశం జరిగింది. అతుల్‌ జైన్‌తో పాటు అఽథారిటీ అధికారులు, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, చీఫ్‌ ఇంజనీర్లు హాజరయ్యారు. పోలవరం నిర్మాణంతో ముర్రేడు, కిన్నెరసానితోపాటు భద్రాచలం పట్టణం మునిగిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ ఈ సందర్భంగా తెలిపింది. అయితే తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులోనే నిర్మిస్తున్నందున తెలంగాణ ముంపునకు గురయ్యే అవకాశాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. ఈ విషయంలో పీపీఏ ఎలాంటి ఆదేశాలిచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దరిమిలా.. పోలవరం నిర్మాణం వల్ల తెలంగాణ భూభాగంలో ఏర్పడే ముంపుపై అధ్యయనం చేసేందుకు, సర్వే చేపట్టడానికి కమిటీ వేస్తామని అతుల్‌ జైన్‌ ప్రకటించారు.


ముసాయిదా ఎంవోయూలో మార్పులు

పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరిస్తోంది. ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తుంటే.. పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నీ పీపీఏ చూస్తోంది. దీనిపై 2014లోనే పీపీఏకి, రాష్ట్ర జల వనరుల శాఖకు మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంది. కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రాజెక్టును గరిష్ఠంగా 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించాలన్నది లక్ష్యం. దీనికి అనుగుణంగానే పీపీఏ ముసాయిదా ఎంవోయూను సిద్ధం చేసింది. అయితే.. అందులో కొన్ని మార్పు చేర్పులను రాష్ట్రప్రభుత్వం సూచించింది. 2019-24 మధ్యకాలంలో ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలు, కట్టడాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీకి గురైంది. వీటిని ఇప్పుడు పునర్నిర్మించాల్సి వస్తోంది. దీనివల్ల వ్యయం పెరిగింది.

సాంకేతిక సమస్యలతోనే జాప్యం!

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే..వాటిని ప్రత్యేక ఖాతాలోకి జమ చేస్తుండాలని రాష్ట్రానికి అతుల్‌ జైన్‌ స్పష్టం చేశారు. కీలక నిర్మాణాల పనులపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేసింది. డయాఫ్రం వాల్‌ను వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర నిధి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినందునే భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు వ్యయం చేయడంలో కాస్త జాప్యం జరిగిందని పీపీఏకి వివరణ ఇచ్చారు. కాగా.. అతుల్‌ జైన్‌ బృందం శనివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలిస్తుంది.

Updated Date - Nov 08 , 2025 | 04:56 AM