Tirumala : కల్తీ నెయ్యి నిందితుడి బెయిల్‌ పిటిషన్‌

ABN , First Publish Date - 2025-02-12T05:57:44+05:30 IST

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు

Tirumala : కల్తీ నెయ్యి  నిందితుడి బెయిల్‌ పిటిషన్‌

  • ‘కౌంటర్‌ ఫైల్‌’కు వ్యవధి కోరిన ఏపీపీ

తిరుపతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ2 నిందితుడైన ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన 2 ఏడీఎం కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌ కుమార్‌.. ఏపీపీ జయశంకర్‌కు నోటీసులు జారీచేశారు. బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేసిన ఏపీపీ.. కౌంటర్‌ ఫైల్‌ చేయడానికి నాలుగు రోజులు వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేరకు కోర్టు ఏపీపీకి గడువు ఇచ్చింది.

సిట్‌కు రూ.51 లక్షల బడ్జెట్‌ కేటాయింపు

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సిట్‌(ప్రత్యేక దర్యాప్తు బృందం)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.51 లక్షల బడ్జెట్‌ కేటాయించింది. సిట్‌ నిర్వహణకు నిధులు కేటాయించాల్సిందిగా డీజీపీ గత డిసెంబరు 12న లేఖ రాయగా ప్రభుత్వం ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2025-02-12T05:57:57+05:30 IST