Bail Granted: మద్యం స్కాంలో మరో ముగ్గురికి బెయిల్
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:39 AM
మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి...
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మంజూరు
దేశం విడిచి వెళ్లొద్దు.. సాక్షులను కలవొద్దని షరతులు
పాస్‌పోర్టులు సమర్పించాలని ఆదేశం
నేడు విడుదల చేయనున్న అధికారులు
విజయవాడ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు డిఫాల్డ్ బెయిల్ మంజూరైంది. మద్యం స్కాంలో ధనుంజయ్‌రెడ్డి ఏ31, కృష్ణమోహన్‌రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. మే 13వ తేదీన గోవిందప్ప, అదే నెల 16వ తేదీన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టయ్యారు. బెయిల్ కోసం ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై వాదప్రతివాదనలు పూర్తవడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు. ముగ్గురూ లక్ష రూపాయల చొప్పున బాండ్‌లు సమర్పించడంతోపాటు ఇద్దరి చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, ఒక్కో పూచీకత్తు కింద రూ.లక్ష డిపాజిట్ చేయాలని షరతు విధించారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను కలవరాదని, సిట్ అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఆ ముగ్గురినీ ఆదివారం విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు.