Share News

బిడ్డ.. నువ్వు ఎక్కడ!

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:38 AM

అమ్మమ్మ, తాతయ్యలను చూసొద్దామని చెల్లితో కలిసి వెళ్లిన పదేళ్ల బాలుడు రొయ్యూరులో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. పోలీసులు నెల రోజులుగా వెతుకుతున్నా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావ్‌ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిదీష్‌ రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చిన్నారి మిస్టరీ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది.

బిడ్డ.. నువ్వు ఎక్కడ!

- నిదీష్‌ అదృశ్యమై నెల రోజులు

- గత నెల 12న రొయ్యూరులో అమ్మమ్మ ఇంటికొచ్చి మాయమైన బాలుడు

- నెల రోజులుగా పోలీసులు గాలిస్తున్నా లభించని ఆచూకీ

- జాడ తెలియక కుమిలిపోతున్న నిమ్మకూరు సర్పంచ్‌ దంపతులు

- మిస్టరీగా చిన్నారి అదృశ్యం వ్యవహారం

అమ్మమ్మ, తాతయ్యలను చూసొద్దామని చెల్లితో కలిసి వెళ్లిన పదేళ్ల బాలుడు రొయ్యూరులో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. పోలీసులు నెల రోజులుగా వెతుకుతున్నా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావ్‌ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిదీష్‌ రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చిన్నారి మిస్టరీ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది.

తోట్లవల్లూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):

పామర్రు మండలం నిమ్మకూరు గ్రామ సర్పంచ్‌ పడమట దుర్గా శ్రీనివాసరావు కుమారుడు నిదీష్‌(10) తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో అదృశ్యమై నెల రోజులు గడిచింది. ఆ రోజు నుంచి పోలీసులు, కుటుంబసభ్యులు ఎంత గాలించినా నేటికీ చిన్నపాటి క్లూ కూడా లభించకపోవటం మిస్టరీగా మారింది. గత జూలై 12వ తేదీన నిమ్మకూరు నుంచి నిదీష్‌ను, అతని చెల్లిని మేనమామ వీరంకి బాలకృష్ణ ద్విచక్ర వాహనంపై రొయ్యూరు తీసుకువచ్చాడు. అమ్మమ్మ, తాతకు చూపించి సాయంత్రానికి నిమ్మకూరు తీసుకువస్తానని నిదీష్‌ తల్లిదండ్రులకు బాలకృష్ణ చెప్పాడు. అదేరోజు సాయంత్రానికి నిదీష్‌ అదృశ్యమయ్యాడు. కేఈబీ కెనాల్‌ పక్కన ఉన్న రామాలయం వద్ద చేతిపంపు నుంచి మంచినీరు తాగటం మాత్రమే కొందరు చూశారు. చెప్పులు దగ్గర్లో ఓ ఇంటి వద్ద విడిచి ఉన్నాయి. దీంతో కాలువలో పడ్డాడని నాలుగు రోజుల పాటు కోడూరు వరకు గాలించినా ఫలితం లేదు. దీంతో గుడివాడ డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌ ఆదేశాలతో నాలుగు టీంలు ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. మేనమామ బాలకృష్ణని, అతనికి ఫోన్‌లు చేసిన స్నేహితులను, ఇతర బంధువులను పోలీసులు స్టేషన్‌కు తీసుకు వచ్చి రకరకాలుగా ప్రశ్నించినా ఎలాంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. ఈ నెల రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిదీష్‌ ఆచూకీ లభ్యం కాలేదని ఎస్సై సీహెచ్‌ అవినాష్‌ తెలిపారు. ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉందన్నారు.

కన్నీళ్లు దిగమింగుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు

ఒక్కగానొక్క మగ బిడ్డ నిదీష్‌ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులు దుర్గా శ్రీనివాసరావు, సరోజిని తమ బిడ్డ అదృశ్యంపై నెల రోజులుగా కన్నీటితో తల్లడిల్లిపోతున్నారు. నిమ్మకూరు విడిచి రొయ్యూరులోనే ఉండి పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఎంత వెదికినా జాడ లేకపోవటంతో దేవుడా మా బిడ్డను మా దగ్గరకు తీసుకురావయ్యా అంటూ ప్రార్థనలు చేశారు. బిడ్డ తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎవ్వరు వచ్చినా తల్లి సరోజిని నిదీష్‌ కనిపించటం లేదని ముద్రించిన పోస్టర్‌ని చూపుతూ కన్నీటి పర్యంతమవుతోంది.

Updated Date - Aug 13 , 2025 | 01:38 AM