CM Chandrababu Babu Acts as Strict Timekeeper: సారు మారారు!
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:01 AM
రాష్ట్రానికి ఏం కావాలో.... ప్రజలకు ఏం చేయాలో.... తనేం కోరుకుంటున్నారో అధికారులకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి ఫర్‌ఫెక్ట్ అనిపించుకున్నారు...
టైమ్ కీపర్ అవతారం ఎత్తిన బాబు
అతి ప్రసంగాలకు ఆదిలోనే చెక్
సూటిగా ప్రభుత్వ ప్రాధాన్యాల వివరణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రానికి ఏం కావాలో.... ప్రజలకు ఏం చేయాలో.... తనేం కోరుకుంటున్నారో అధికారులకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి ఫర్‌ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇదివరకటి కలెక్టర్ల సదస్సుల్లోలా... సాగదీతలు, చెప్పిందే చెప్పడం, సుదీర్ఘ ప్రసంగాలను పక్కనపెట్టారు. చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు, శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం...ఎప్పుడో జమానాకాలం నాటి రిపోర్టులు, ప్రజంటేషన్లు కాలదోషం పట్టాయని, ఇక వాటి జోలికి వెళ్లనని స్పష్టం చేయడం ఈ సమావేశాల్లో హైలెట్ అంశం. ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో సత్వరమే అందాలి. ప్రతిపనికీ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ, అందుకు అవసరమైన రియల్‌టైమ్ గవర్నెన్స్ సేవల గురించి దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ వాడకం గురించి బోధించారు. చంద్రబాబు అనగానే కంప్యూటర్, ఆన్‌లైన్, ఇంటర్నెట్ సేవలు అని అంటుంటారు. ఆయన తీరే అంత అని చెబుతుంటారు. కానీ టెక్నాలజీ వినియోగంతో పౌరసేవల్లో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలనావ్యవహారాల్లో ఇప్పటికే వచ్చిన నూతన ధోరణులు, పోకడల గురించి ఆయన సవివరంగా చెప్పారు. చాలామంది నవయువ ఐఏఎ్‌సలు ఉండటం కూడా ఆయనకు ఈసారి కలిసొచ్చింది. సాంకేతికంగా ఉన్నత విద్యావంతులైన కలెక్టర్లను ప్రశంసిస్తూనే, వారిద్వారా పరిపాలనలో తీసుకురాబోయే సంస్కరణల గురించి చెప్పారు. కలెక్టర్లు, అధికారుల్లో భరోసా ఇచ్చేందుకు ఆయన మరో అడుగు ముందుకేసి... ‘ఇది నా టీమ్, యంగ్‌టీమ్..’ అంటూ పలు సందర్భాల్లో వారిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, టెక్నాలజీ వాడుకోవడం, ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉన్న మార్గాలపై ఆయన సునిశితంగా చెప్పడం ఇటు సీనియర్ ఐఏఎ్‌సలను కూడా ఆకర్షించింది. టెక్నాలజీలో ఉన్నతంగా ఉన్న అధికారులను సైతం ముఖ్యమంత్రి పలు అంశాలపై లేవనెత్తిన సాంకేతిక సందేహాలను ఆలోచింపచేసింది. సమావేశం ఆరంభం నుంచే చంద్రబాబు పూర్తిస్థాయి టైమింగ్‌ను ప్రదర్శించారు. ’’గతంలో అనేక అజెండాలు, చర్చనీయాంశాలు ఉండేవి. చర్చల సందర్భంగా కొన్ని సందర్భాల్లో ఫోకస్ పక్కకు పోయేది. ఈ సారి అలా జరగడానికి వీల్లేదు. ప్రజంటేషన్‌లకే పరిమితం కావాలి. అంతకు మించి మరే చర్చ అవసరం లేదు. సమయానికి మించి ఎవరూ మాట్లాడొద్దు. అనవసర విషయాలపై మనసు మళ్లొద్దు’’ అంటూ కార్యదర్శులు, కలెక్టర్‌లకు గీతోపదేశం చేశారు. ఎవరైనా ఇచ్చిన టైమ్‌కన్నా ఎక్కువగా ప్రజంటేషన్ ఇస్తుంటే సీఎస్ బెల్లుకొట్టి సమయం గుర్తుచేస్తారు. ఈ సారి సీఎంనే ఆపాత్ర పోషించారు.
అప్పట్లో...
గతంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 10-12 గంటలపాటు సాగేవి. ఒక్కో శాఖ వందల పేజీల ప్రజంటేషన్ ఇచ్చేది. సగటున ఒక శాఖకు 30 నిమిషాలు ఇచ్చినా రెండున్నర గంటలు ప్రజంటేషన్‌లు ఇచ్చిన సందర్భాలున్నాయి. దీంతో సమయపాలన ఉండేదికాదు. సాయంత్రం నాలుగైదు గంటలకే ముగియాల్సిన సెషన్ అర్ధరాత్రిదాకా సాగిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితిని మీడియా, అధికారులు సీఎంకు నివేదించారు. ఎంత సుదీర్ఘ సమావేశాలు జరిగాయన్నది ముఖ్యంకాదు...ఎంత ఉపయోగకరమైనచర్చ జరిగిందన్నదే కీలకమని సీఎంకూడా గుర్తించారు. కలెక్టర్ల సదస్సులో ‘మారిన చంద్రబాబు’ను చూసి అందరూ గొప్ప రిలీఫ్ పొందారు. తొలి రోజు 8గంటలకు, రెండోరోజు సాయంత్రం 5 గంటలకే సమావేశం ముగించారు.
’’రూ అర్బన్’గా మార్చండి..
‘‘కొన్ని గ్రామాలను మున్సిపాలిటీగామార్చే అవకాశం ఉంటే... మార్పు చేయండి. కొన్ని పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా మార్చండి. కలాం ఫిలాసఫీ ‘రూ అర్బన్’ను అమలుచేయండి.’’ అని చంద్రబాబు నిర్దేశించారు.
‘ఇది నా టీమ్..’ అంటూ..
అధికారుల్లో ఉత్సాహం, నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా అనేక అంశాలు చెప్పారు. ఇకపై పీపీటీలు, రిపోర్టుల రూపంలో కలెక్టర్లపై భారం ఉండదని ప్రకటించారు. ఇది నిజంగా ఇటు ప్రభుత్వానికి, అటు కలెక్టర్‌లకు మేలుచేసే పెద్ద నిర్ణయం. ఆయా శాఖల పురోగతి, పనితీరు ఫలితాలన్నీ ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజలతో కలిసి పనిచేయడమే కలెక్టర్ల పనితీరుకు గీటురాయిగా ఉంటుందని చెప్పడం ద్వారా వారికి గ్రామాల సందర్శన ప్రాధాన్యతను వివరించారు. సంక్షేమ హాస్టళ్ల తనిఖీ వంటి కీలక బాధ్యత అనేది వారి డ్యూటీచార్ట్‌లో పెట్టి సీఎం సంచ లన నిర్ణయం తీసుకున్నారు.