Minister Satya Kumar: హోమియో మందుల్లో 2.21 కోట్లు ఆదా
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:38 AM
రాష్ట్రంలోని హోమియో ఆస్పత్రులు, మూడు బోధనాసుపత్రులకు అవసరమైన హోమియో మందుల కొనుగోళ్లలో ఆయుష్ విభాగం రూ. 2.21 కోట్లు మేర ఆదా చేసింది.
సింగిల్ టెండర్‌కు మంత్రి సత్యకుమార్ ఆమోదం
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హోమియో ఆస్పత్రులు, మూడు బోధనాసుపత్రులకు అవసరమైన హోమియో మందుల కొనుగోళ్లలో ఆయుష్ విభాగం రూ. 2.21 కోట్లు మేర ఆదా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 14 కోట్లు విలువైన హోమియో మందులు కొనడానికి ఆయుష్ విభాగం రెండుసార్లు టెండర్లు పిలిచినా కేరళ ప్రభుత్వానికి చెందిన ‘కేరళ హోమియోపతిక్ కోపరేటివ్ ఆర్గనైజేషన్’ ఒక్కటే స్పందించింది. మందుల అత్యవసరం దృష్ట్యా కొనుగోలుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ, ఆయుష్ విభాగం అధికారులు కోరిన మీదట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనుమతి ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు టెండర్ వేసిన సంస్థతో చర్చించిన అధికారులు కోట్ చేసిన ధర కంటే 16.88 శాతం తక్కువకు సరఫరా చేసేందుకు ఒప్పించారు. దీని వల్ల మొత్తం కొనుగోళ్లలో రూ. 2.21 కోట్లు ఆదా అవుతుందని, మొత్తంగా 162 రకాల హోమియో మందులు 207 హోమియో ఆస్పత్రులు, మూడు బోధనాసుపత్రులకు సరఫరా అవుతాయని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ధరలు తగ్గించేలా చర్చలు జరిపిన ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులను మంత్రి అభినందించారు. గత ప్రభుత్వం హయాంలో ఇదే కంపెనీ కర్ణాటకకు సరఫరా చేసిన ధర కంటే 13 శాతం అధిక ధరకు మనకు సరఫరా చేసిందని అధికారులు చెప్పారు.