Independent surgical practice: ఆయుర్వేదంలో ఆపరేషన్లకు అనుమతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:28 AM
పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్స విధానాలతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు...
పీజీ పూర్తి చేసిన వైద్యులకు అవకాశం
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్స విధానాలతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆయుర్వేదలో పీజీ పూర్తి చేసిన వైద్యులకు స్వంతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు.ఆయుర్వేదలో వైద్యులకు శస్త్రచికిత్స ప్రక్రియకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి - 2020, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేలా తగు గుర్తింపతో పాటు అనుమతివ్వడానికి ఆంగీకరించినట్లు వివరించారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే శస్త్ర చికిత్సా విధానంలో పీజీ పట్టా పొందిన వైద్యలు శస్త్ర చికిత్సలు చేయడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ నిర్ణయంతో 39 శల్యతంత్ర (జనరల్ సర్జరీ) శస్త్ర చికిత్సలు, 9 శలక్యతంత్ర (ఈఎన్‌టి, ఆప్తమాలజీ) చికిత్సలను ఆయుర్వేద వైద్యుల చేయవచ్చునన్నారు. వీటిలో అంటు వ్యాధులకు, ప్రమాదాల కారణంగా దెబ్బతిన్న జీవకణాల తొలగింపు, గాయాలకు శస్త్ర చికిత్సలు, కుట్లు వేయడం, మొలలు, మలద్వారంలో చీలికలకు చికిత్స, కణుతులు, శుక్లాలు, గవదల తొలగింపు, కండరాల చికిత్స, చర్మమార్పిడి చికిత్సలు చేయవచ్చునన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలన కేంద్ర ప్రభుత్వం - 2020లోనే విడుదల చేసిందని, గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆయుష్ సేవల పట్ల వారి నిర్లక్ష్యానికి ఇదోక ఉదాహరణగా మంత్రి వెల్లడించారు.