Share News

AP Govt: స్క్రబ్‌ టైఫస్‌పై అవగాహన కల్పించండి

ABN , Publish Date - Dec 03 , 2025 | 06:29 AM

రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

AP Govt: స్క్రబ్‌ టైఫస్‌పై అవగాహన కల్పించండి

  • కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ బారినపడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతిచెందిందని, తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మృతికి కారణాలను చంద్రబాబుకి సౌరభ్‌ గౌర్‌ వివరించారు. విజయనగరానికి చెందిన రాజేశ్వరిని చిగ్గర్‌ మైట్‌ అనే కీటకం కుట్టిందని చెప్పారు. తొలుత టైఫాయిడ్‌కు చికిత్స అందించారని, ఆ తర్వాత ర్యాపిడ్‌ టెస్ట్‌ ద్వారా స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ అని తేల్చారని తెలిపారు. విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారని చెప్పారు. ఓరింటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. వ్యాధి తీవ్రత పెరగకముందే చికిత్స అందించాలని సీఎం సూచించారు. కాగా, స్క్రబ్‌ టైఫస్‌ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.

Updated Date - Dec 03 , 2025 | 06:30 AM