AP Govt: సరికొత్తగా అవేర్ 2.0
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:35 AM
వాతావరణం ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, జలాశయాల్లో నీటి నిల్వలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది.
వాతావరణ మార్పులను 7 రోజుల ముందే పసిగట్టి
ముందస్తు సమాచారం ఆధునిక వ్యవస్థ సిద్ధం
వాతావరణం, విపత్తుల నిర్వహణ, నదుల ప్రవాహం, భూగర్భ జలాలు, పంటల స్థితిపై హెచ్చరికలు జారీ
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వాతావరణం ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, జలాశయాల్లో నీటి నిల్వలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటికే ‘అవేర్’ ద్వారా వివిధ అంశాల్లో ప్రజలకు ముందస్తు సమాచారాన్ని అందిస్తోన్న ప్రభుత్వం మరిన్ని రంగాలను కూడా ఈ వ్యవస్థ కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. భారీ వర్షాలు, పిడుగులు, తుఫాన్లు, తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల వంటి అంశాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి, అప్రమత్తం చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు, ఆస్తుల్ని కాపాడేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రిసెర్చ్ సెంటర్- అవేర్ 2.0 వ్యవస్థను ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసింది. నదులు, జలశయాల్లో నీటి నిల్వలు, భూమిలో తేమ, గాలి నాణ్యత, కాలుష్యం, భూగర్భ జలాలు.. ఇలా వేర్వేరు అంశాలను పర్యవేక్షించేలా, ప్రజలకు వేగంగా సమాచారాన్ని అందించేలా ‘అవేర్ 2.0’ను రూపొందించినట్టు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. అవేర్ 2.0 వ్యవస్థ వాతావరణంలో వచ్చే మార్పులను 7రోజుల ముందుగానే పసిగట్టి, హెచ్చరికలు జారీ చేయనుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజల ప్రాణాలు, ఆస్తులు, మూగజీవాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. అవేర్ 2.0తో విపత్తు నష్టాలను తగ్గించి, మరణాలను నివారించే అవకాశం ఉంటుందని ఆర్టీజీఎస్ చెబుతోంది. కచ్చితమైన ముందస్తు సమాచారం ఆధారంగా విపత్తుల సమయాల్లో రైతుల పంటల నిర్వహణ, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలోని 109 జలాశయాలు, కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదులపై రియల్ టైమ్ మానటరింగ్‌ను కూడా చేయవచ్చని పేర్కొన్నారు. అవేర్ 2.0 ద్వారా వ్యవసాయం, మత్స్య, రవాణా, విద్యుత్, జలవనరుల వంటి 42 విభాగాలకు సేవలు అందనున్నాయని చెప్పారు. ్చఠ్చీట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో వాతావరణ సూచనలు, జలాశయాల స్థితి, నదుల ప్రవాహాలపై లైవ్ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. భూగర్భ జలాల లభ్యతతో పాటు మండల, జిల్లాల వారీగా పంటలకు వచ్చే తెగుళ్లు వంటి అంశాల్లోనూ అవేర్ హెచ్చరికలు జారీ చేస్తుందని చెప్పారు. సముద్రంలో ఏఏ ప్రాంతాల్లో చేపల లభ్యత ఎక్కువగా ఉంటుందో కూడా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలియజేస్తుందని వెల్లడించారు.