Awake Bypass Surgery: స్పృహలో ఉండగానే బైపాస్ సర్జరీ
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:10 AM
దేశంలోనే తొలిసారిగా 76 ఏళ్ల మయాస్థీనియా గ్రేవిస్ రోగికి పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి...
ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
విజయవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా 76 ఏళ్ల మయాస్థీనియా గ్రేవిస్ రోగికి పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి తమ వైద్య బృందం వైద్య రంగంలో అరుదైన ఘనత సాధించిందని ఆస్టర్ రమేష్ ఎండీ డాక్టర్ పి.రమే్‌షబాబు తెలిపారు. విజయవాడ ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగి గుండెకు రక్తం సరఫరా చేసే మూడు ప్రధాన ధమనుల్లో పూడికలు ఉండడమే కాకుండా, శ్వాస కోశ కండరాలను బలహీనపరిచే మయాస్థీనియా గ్రేవిస్ వ్యాధి కూడా ఉందని చెప్పారు. ఇటువంటి రోగులకు జనరల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండడంతో వైద్యబృందం అవేక్ బైపాస్ టెక్నిక్‌ను ఎంచుకుందని, ఈ పద్ధతిలో రోగి శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపు స్పృహతో ఉండి, శ్వాస తీసుకున్నారని ఆయన తెలిపారు. థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఛాతీ భాగానికి మాత్రమే మత్తు ఇచ్చామని, వెంటిలేటర్ అవసరం లేకుండానే శస్త్రచికిత్స ముగిసిందని పేర్కొన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్స్ బృందం డాక్టర్లు జయరామ్ పాయ్, శివప్రసాద్, అశోక్‌కుమార్, భరత్ సిద్ధార్థ్, శ్రీకాంత్ మహాపాత్ర, అనస్థీషియా బృందం లోగనాథన్ చక్రవర్తి, పవన్, హిమబిందు విజయవంతంగా పూర్తిచేశారన్నారు. హాస్పిటల్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో సర్జరీలు జరుగుతున్నాయని తెలిపారు. హాస్పిటల్ సాధించిన విజయాలు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యాయన్నారు. గత 37 ఏళ్లుగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో ఇప్పటి వరకు 25వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు విజయవంతం చేశామని, వాటిలో అత్యంత క్లిష్టమైన 2,500కు పైగా బైపాస్ సర్జరీలు, వాల్వ్ మార్పిడి సర్జరీలు, 3,500లకు పైగా నవజాత శిశువులు, పిల్లల గుండె శస్త్రచికిత్సలు చేశామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద పదివేల సర్జరీలు నిర్వహించామన్నారు.