Share News

SIT: మద్యం ఆర్డర్ల కుట్రలో అవినాశ్‌రెడ్డే కీలకం

ABN , Publish Date - Oct 25 , 2025 | 06:09 AM

వైసీపీ హయాంలో ముడుపులు చెల్లించిన డిస్టిలరీలకు మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చే విషయంలో రాజ్‌కసిరెడ్డి (ఏ1)తో కలిసి పిటిషనర్‌ ముప్పిడి అవినాశ్‌రెడ్డి...

SIT: మద్యం ఆర్డర్ల కుట్రలో అవినాశ్‌రెడ్డే కీలకం

  • ‘ముడుపుల’ భేటీలకు రాజ్‌కసిరెడ్డితో కలిసి హాజరు

  • ప్రస్తుతం పరారీలో.. ముందస్తు బెయిల్‌కు అర్హుడు కాదు

  • సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ముడుపులు చెల్లించిన డిస్టిలరీలకు మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చే విషయంలో రాజ్‌కసిరెడ్డి (ఏ1)తో కలిసి పిటిషనర్‌ ముప్పిడి అవినాశ్‌రెడ్డి పలు సమావేశాల్లో పాల్గొన్నారని దర్యాప్తులో తేలిందని ‘సిట్‌’ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. మద్యం ఆర్డర్ల కుట్రలో పిటిషనర్‌ది కీలక పాత్ర అని, దేశంలో ఏ రాష్ట్రంలో వినియోగంలో లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టారని తెలిపారు. అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. దర్యాప్తునకు సహకరించకుండా విదేశాలకు పారిపోయినందున ముందస్తు బెయిల్‌ దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. కాగా, పిటిషనర్‌ తరఫున రిప్లై వాదనల కోసం విచారణను ఈనెల 31కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ముప్పిడి అవినాశ్‌ రెడ్డి (ఏ7) హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రమాకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

Updated Date - Oct 25 , 2025 | 06:10 AM