అవనిగడ్డ ట్రెజరీ ఉద్యోగి అరెస్టు
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:59 PM
అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధులు దారిమళ్లించిన సీనియర్ అకౌంటెంట్ టంటాం వెంకటరెడ్డిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.1.58 కోట్ల అవినీతికి వెంకటరెడ్డి పాల్పడినట్లు జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారి ఎస్.రవికుమార్ అవనిగడ్డ పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరులు వెంకటరెడ్డిని అరెస్టు చేశారు.

- రూ.1.58 కోట్లు దారి మళ్లించిన సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారి
- వెంకటరెడ్డిని అరెస్టు మొవ్వ కోర్టులో హాజరుపర్చిన డీఎస్పీ విద్యశ్రీ
- 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయాధికారి
అవనిగడ్డ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధులు దారిమళ్లించిన సీనియర్ అకౌంటెంట్ టంటాం వెంకటరెడ్డిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.1.58 కోట్ల అవినీతికి వెంకటరెడ్డి పాల్పడినట్లు జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారి ఎస్.రవికుమార్ అవనిగడ్డ పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరులు వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ట్రెజరీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. నిందితుడు వెంకటరెడ్డిని ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ మొవ్వ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయాధికారి రాజన్ ఉదయ్ ప్రకాష్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.
విచారణ తీరుపై పెదవి విరుస్తున్న పెన్షనర్లు
అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో జరిగిన రూ.1.58 కోట్ల నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో ఆ శాఖ అధికారులు నిర్వహిస్తున్న విచారణ తీరుపై పెన్షనర్లు పెదవి విరుస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా కేవలం లబ్ధిదారుని ఖాతాకు జమ కావాల్సిన మొత్తాలను డూప్లికేట్ బిల్లులు, ఓచర్లు పెట్టి నేరుగా తన ఖాతాకు, అనుచరుల ఖాతాలకు ప్రభుత్వ సొమ్మును ఓ ఉద్యోగి దారి మళ్లించగలగటం, కేవలం రెండు, మూడు రోజుల వ్యవధిలో ఒకే వ్యక్తి పేరుతో సీఎఫ్‌ఎంఎస్ ఫేజ్-2 సీఎఫ్‌ఎంఎస్ ఫేజ్-1లకు బిల్లులు పంపి ఫేజ్ -1 నుంచి వచ్చే డబ్బును వేరు ఖాతాలకు బదిలీ చేయించుకోగలగటం ఆ శాఖల్లోని పర్యవేక్షణా లోపాన్ని ఎత్తి చూపుతోందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారుల సహాయ సహకారాలు లేకుండా కేవలం ఒక సీనియర్ అకౌంటెంట్ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా దారి మళ్లించగల్గుతారని ప్రశ్నిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం సీనియర్ అకౌంటెంట్‌ను మాత్రమే పూర్తిస్థాయిలో బాధ్యుడిని చేస్తూ అతనిపై కేసు పెట్టి, పర్యవేక్షణా లోపాన్ని ఎత్తి చూపుతూ ఎస్టీవోను మాత్రమే సస్పెండ్ చేశారని, జిల్లా అధికారుల పాత్ర గురించి వెంకటరెడ్డి శాఖాపరంగా జరిగిన విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించినప్పటికీ ఆ విషయాలను పట్టించుకోవటం లేదన్న వాదన ట్రెజరీ ఉద్యోగుల నుంచి కూడా వినవస్తోంది.