స్టాండులేక ఆటోవాలాల ఇక్కట్లు
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:05 AM
మండల కేంద్రమైన దువ్వూరులో ఆటోస్టాండులేక ఆటోవా లాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దువ్వూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన దువ్వూరులో ఆటోస్టాండులేక ఆటోవా లాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపక్కనే ఆటోలను నిలుపుతన్నారు. దువ్వూరు గ్రామ పంచాయతీలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా ఆటోలు, జీపులు నిలబడేందుకు తగిన స్థలం లేక మూడు రోడ్ల కూడలిలో ఇవి నిలుస్తున్నాయి. మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు జనాలను తరలించే నేపథ్యంలో ఇక్కడ రద్దీ అధికంగా ఉంటోంది. మండలంలో 30కిపైగా గ్రామాలకు ఆటోలు, జీపులు నిత్యం నడుస్తుంటాయి. రమారమి 50 ఆటోలు, 30 జీపులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా రోడ్లమీద ఆటోలు నిలబడుతున్నాయి. పోలీసు క్వార్టర్స్ స్థలంలో జీపులు ఆగుతున్నాయి. వాటి వలన స్థానికంగా ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. ఈ సమస్య కొన్నేళ్లుగా కొనసాగుతున్నా గ్రామ పంచాయతీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రజలతోపాటు వాహనచోదకులు విమర్శిస్తున్నారు. వారి నుంచిగ్రామ పంచాయతీ రోజువారీగా రుసుం వసూలు చేస్తూ పంచాయతీ సొంత నిధులు సమకూర్చుకోవడం మంచి పద్ధతి అయినా వాహనాలు నిలిపేందుకు స్టాండును ఏర్పాటు చేయకపోవ డం ఏమిటని గేటు డబ్బులు చెల్లించే వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. దువ్వూరు గ్రామ పంచాయతీలో స్థానిక సమస్యలు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
సమావేశంలో సమస్యలపై చర్చిస్తాం
పంచాయతీ సమావేశంలో సమస్యలపై చర్చిస్తా మని గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఆటోల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ వివరణకోరగా పై విధంగా స్పందిం చారు. దినసరి మార్కెట్ బస్టాండు వేలం పాట ద్వారా రూ.3,11,500 సొంత నిధులు సమకూరుతున్నాయని ఇవి జనరల్ ఫండ్ నిధుల్లో జమ అవుతాయన్నారు. వేలంపాట చేపట్టిన చోదకుల వాహనాలు నిలిపే సౌకర్యం ఏర్పాటు చేయలేదని ఎప్పటి నుంచో ఈ ఆనవాయితీ కొనసాగుతోందని పేర్కొన్నారు. పంచాయతీ సమావేశంలో వాటన్నింటిపైన చర్చ జరుపుతామని చెప్పారు.