Auto Drivers Welfare: సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:28 AM
దేశంలోని మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రులు ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ల సేవలో...
‘ఆటో డ్రైవర్ల సేవలో’ మంత్రుల ఉద్ఘాటన
రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా కార్యక్రమాలు
స్వయంగా ఆటోలు నడిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
దేశంలోని మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రులు ఉద్ఘాటించారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఖాకీ చొక్కాలు ధరించి పాల్గొన్నారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఒంగోలులో నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆటోను నడపగా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆటోలో కూర్చుని ప్రయాణించారు. కడప జిల్లా పులివెందులలో మంత్రి సవిత స్వయంగా ఆటో నడిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆటోడ్రైవర్లు క్షీరాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆటోలు నడిపారు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆటోడ్రైవర్లను నమూనా చెక్కును అందజేశారు. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గుంటూరులో మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి ఆటోలో ప్రయాణించారు. బాషా సినిమాలోని ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అన్న డైలాగ్‌ను మంత్రి ఉదహరించారు. విశాఖపట్నం జిల్లా సిరిపురంలో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. అల్లూరి జిల్లా పాడేరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ నమూనా చెక్కు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో మంత్రి పి.నారాయణ ఆటో నడిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఖాకీ డ్రస్ ధరించి ఆటో నడిపారు.
ఖద్దరు కన్నా ఖాకీ ఇచ్చిన ధైర్యమే ఎక్కువ: రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘‘ఖద్దరు కన్నా.. ఖాకీ వేసుకుంటేనే ఎక్కువ ధైర్యం వస్తోంది. విమానయాన శాఖ మంత్రిగా విమాన కాక్ పిట్ వెళ్లేటప్పుడు ఇచ్చే ఆనందం కన్నా .. ఆటో క్యాబిన్‌లో ప్రయాణిస్తూ ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటుంది’ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆటో నడిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లు తమ ప్రచారకర్తలన్నారు.


