GST Collection: ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 2,977 కోట్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:15 AM
ఆగస్టులో జీఎస్టీ నికర వసూళ్లు రూ. 2,977 కోట్లకు చేరాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఎ తెలిపారు. గత నెలలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ. 3,989 కోట్లకు చేరుకున్నాయన్నారు.
ఆగస్టులో జీఎస్టీ వసూళ్ల లెక్క ఇదీ
నికర జీఎస్టీలో 13.82 శాతం పెరుగుదల
21 శాతం పెరిగిన స్థూల జీఎస్టీ వసూళ్లు
పెట్రో ఉత్పత్తుల్లోనూ 9 శాతం అధికం
వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆగస్టులో జీఎస్టీ నికర వసూళ్లు రూ. 2,977 కోట్లకు చేరాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఎ తెలిపారు. గత నెలలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ. 3,989 కోట్లకు చేరుకున్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వరుసగా 5 నెలల పాటు నికర, స్థూల జీఎస్టీలు పెరుగుతూ వచ్చాయన్నారు. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈఏడాది ఆగస్టులో నికర జీఎస్టీ వసూళ్లు 13.82 శాతం, స్థూల జీఎస్టీ వసూళ్లు 21 శాతానికి పైగా పెరిగాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికం. 2025 ఆగస్టులో ఎస్‌జీఎ్‌సటీ (రాష్ట్ర జీఎస్టీ) రూ. 1,364 కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో వసూలైన ఎస్‌జీఎస్టీ కంటే ఇది 13.82 శాతం అధికం. ఈ ఆగస్టులో ఐజీఎస్టీ రూపంలో రూ. 1,613 కోట్లు వచ్చాయి. గత ఆగస్టు కంటే ఇది 3.76 శాతం ఎక్కువ. ఇక పెట్రో అమ్మకాల్లో పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో పెట్రో ఉత్పత్తుల నుంచి రూ. 1,389 కోట్ల ఆదాయం వచ్చిందని బాబు.ఎ తెలిపారు. గత ఆగస్టు కంటే ఇది 9 శాతం అధికమని చెప్పారు. వృత్తి పన్ను వసూళ్లు కూడా ఈ ఆగస్టులో 42.3 శాతం పెరిగాయన్నారు.