Share News

Visakhapatnam: ఖరీఫ్‌ను ఆదుకున్న ఆగస్టు

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:08 AM

నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నా.. ఆగస్టు నెల ఆదుకుంది. ఆగస్టులో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి జూలై నెలాఖరు...

Visakhapatnam: ఖరీఫ్‌ను ఆదుకున్న ఆగస్టు

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నా.. ఆగస్టు నెల ఆదుకుంది. ఆగస్టులో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 416.5 మి.మీ.కు గాను 255.7 మి.మీ. వర్షపాతం (సాధారణం కంటే 25.1 శాతం తక్కువ) నమోదయ్యింది.. సగానికిపైగా మండలాల్లో మెట్ట పంటలు ఎండిపోయాయి. విత్తనాలు, నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఆగస్టులో 160.8 మి.మీ.కుగాను 204.5మి.మీ. వర్షపాతం నమోదుకావడంతో వర్షపాతం లోటు 25.1 నుంచి 4.9 శాతానికి తగ్గింది. అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురవడంతో ఖరీఫ్‌ పంటలకు ప్రాణం పోసినట్టయింది. అయితే, విస్తారంగా వర్షాలు కురిసినా 26 జిల్లాలకు గాను ఇంకా పశ్చిమ గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కడప, నెల్లూరు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. మొత్తం 670 మండలాలకుగాను 154 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో 23, కోనసీమలో 14, పశ్చిమ గోదావరిలో 13, కడపలో 20 మండలాల్లో వర్షాభావం కొనసాగుతోంది. అయితే విచిత్రంగా ఈ ఏడాది రాష్ర్ట్రంలోని పలు ప్రాంతాలు, ఉత్తరకోస్తాలో అనుకున్నమేర వర్షాలు కురవలేదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రుతుపవనాల్లో మార్పుల ప్రభావంతో ఒకచోట భారీవర్షాలు, మరోచోట తక్కువ వర్షాలు కురుస్తున్నాయన్నారు. మూడు నెలల కాలంలో సగటున 46 రోజులు వర్షాలు కురిశాయి. మెట్ట ప్రాంతాల్లో ఆలస్యంగానైనా వర్షాలు కురిశాయి. కానీ పల్లపు ప్రాంతాలు, వాగులు, కాలువల సమీప పొలాలు ముంపు బారిన పడ్డాయి. మిగతా చోట్ల ఖరీఫ్‌ పంటలు బాగానే పడ్డాయి. ఈ సీజన్‌లో 77.90 లక్షల ఎకరాల్లో 21 రకాల వ్యవసాయ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటివరకు 55.30లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి.


రెండురోజుల్లో అల్పపీడనం!

సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ తెలిపింది. ఇది నాలుగో తేదీన ఒడిశా తీరం దాటి మధ్య భారతం వైపు పయనిస్తుందని అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో మంగళవారం నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబరు రెండో వారం చివరిలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 05:12 AM