‘ఆగస్టు’ అలెర్ట్
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:34 AM
జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో పెరుగు తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఉరకలేస్తున్న కృష్ణమ్మ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటి పరిమాణం పెరుగుతున్న కొద్దీ అధికారులకు గత ఏడాది ఆగస్టు పరిణామాలు గుర్తుకొస్తున్నాయి.
5 లక్షల క్యూసెక్కులకు చేరువలో ‘కృష్ణా’
బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ఇన్‌ఫ్లో 4.85 లక్షల క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో 4.81 లక్షల క్యూసెక్కులు
ఈ ఏడాది రెండోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
నేటికి 5 లక్షల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో చేరే అవకాశం
పులిచింతలకు ఇన్‌ఫ్లో 3.98 లక్షల క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో 4.13 లక్షల క్యూసెక్కులు
అజితసింగ్ నగర్‌లో దిగిన పడవలు
జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో పెరుగు తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఉరకలేస్తున్న కృష్ణమ్మ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటి పరిమాణం పెరుగుతున్న కొద్దీ అధికారులకు గత ఏడాది ఆగస్టు పరిణామాలు గుర్తుకొస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కి ఇన్‌ఫ్లో 4,85,539 క్యూసెక్కులు ఉండగా, దిగువకు 4,81,194 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పాలేరు 5,625, కీసర 17,590, పులిచింతల 3,86,770 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీని నుంచి కాల్వలకు 4,345 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లో ఐదు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ నుంచి ఫోర్‌కాస్ట్ వస్తోంది. గడచిన ఏడాది ఆగస్టు 31వ తేదీ రాత్రి ఒక పక్క కృష్ణమ్మ, మరోపక్క బుడమేరు కట్టలు తెంచుకుని రావడంతో విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే ఆగస్టులో తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్న వరద నీరు మొత్తం పులిచింతలకు చేరుతోంది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీని తాకుతోంది. ప్రస్తుతం బ్యారేజీ అవుట్ ఫ్లో 4.85 లక్షల క్యూసెక్కులు ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ఏడాది బ్యారేజీకి వరద ప్రారంభమైనప్పటి నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం ఇది రెండో సారి. ఆగస్టు మొదటి వారంలో ఐదు లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చింది. దిగువకు అదే మొత్తాన్ని వదిలారు. ఆ సమయంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్‌ఫ్లో 3,97,750 క్యూసెక్కులు ఉన్నప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఐదు లక్షల క్యూసెక్కుల వరకు వరద వస్తోందని అధికారులు అంచనా వేశారు.
పులిచింతలకు అదే పరిస్థితి
ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆగడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. పులిచింతలకు ఇన్‌ఫ్లో నెమ్మదిగా పెరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు నమోదైన రీడింగ్ ప్రకారం ప్రాజెక్టుకు 3,97,807 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రకాశం బ్యారేజీకి 4,13,395 క్యూసెక్కుల నీటిని వదిలారు. గంట తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు నమోదైన రీడింగ్ ప్రకారం ఎగువ నుంచి పులిచింతలకు 3,98,807 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీని నుంచి 4,13,237 క్యూసెక్కుల నీటిని బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఇన్‌ఫ్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పులిచింతల అధికారులకు సమాచారం అందింది. ఈ ఇన్‌ఫ్లో మరింతగా పెరిగితే ప్రకాశం బ్యారేజీని ఐదు లక్షల క్యూసెక్కుల నీరు తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
మున్నేరు, బుడమేరు ప్రశాంతం
జిల్లాలో ఉన్న మున్నేరు, బుడమేరు వాగులు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ రెండింటిలో మున్నేరు నుంచి వస్తున్న నీరు చాలా స్వల్పంగా ఉంది. బుడమేరకు ఎలాంటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కనిపించడం లేదు. మున్నేరుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రీడింగ్ నమోదైంది. ఇన్‌ఫ్లో 6,385 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,245 క్యూసెక్కులు ఉంది. బుడమేరుకు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇన్‌ఫ్లో ఆగిపోయింది. బుడమేరు పరివాహక ప్రాంతంగా ఉన్న అజితసింగ్ నగర్‌లో అధికారులు పడవలను దింపారు. వాటిని బుడమేరు గట్టు వద్ద సిద్ధంగా ఉంచారు. దీంతో అక్కడి ప్రజల్లో బుడమేరు భయం మొదలైంది. బుడమేరు కాల్వలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడానికి ఈ పడవలను తీసుకొచ్చినట్టు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. భారీ వరదల నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు చేసిన హెచ్చరికల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ పడవలను అందుబాటులో ఉంచినట్టు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటన విడుదల చేశారు.