Share News

Andhra University: ఏయూలో విద్యార్థుల ఆందోళన విరమణ

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:43 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా కొనసాగిన విద్యార్థుల ఆందోళన ముగిసింది. హాస్టల్‌ విద్యార్థి మణికంఠ గురువారం సకాలంలో వైద్యం అందక మరణించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే

Andhra University: ఏయూలో విద్యార్థుల ఆందోళన విరమణ

క్యాంప్‌సలో వైద్య సదుపాయాలపై కమిటీ నియామకం

వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి వీసీ హామీ

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా కొనసాగిన విద్యార్థుల ఆందోళన ముగిసింది. హాస్టల్‌ విద్యార్థి మణికంఠ గురువారం సకాలంలో వైద్యం అందక మరణించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. హెల్త్‌ సెంటర్‌లో మౌలిక వసతులు కల్పించాలని తాము చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నా వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీస చర్యలు చేపట్టకపోవడం వల్లే ఆక్సిజన్‌ అందక మణికంఠ మృతిచెందాడని విద్యార్థులు ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ వీసీ రాజీనామా చేయాలని, మణికంఠ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రిజిస్ట్రార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. యూనివర్సిటీ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి ధర్నా వద్దకు చేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీసీ రాజశేఖర్‌, రిజిస్ట్రార్‌ రాంబాబు శుక్రవారం ఉదయం యూనివర్సిటీకి రాలేదు. పరిస్థితి గమనించిన కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ క్యాంప్‌సలో వైద్య సదుపాయాలపై అధ్యయనానికి కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, డీఎంహెచ్‌ఓ, ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌తో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా విద్యార్థులతో చర్చలకు జిల్లా సహకార శాఖ అధికారిణి ప్రవీణను పంపించారు. అదే సమయానికి వీసీ రాజశేఖర్‌, రిజిస్ట్రార్‌ రాంబాబు, తదితరులు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వారు హామీ ఇచ్చారు. హెల్త్‌ సెంటర్‌లో మౌలిక వసతుల కల్పన విషయమై విద్యార్థి సంఘాల తరపున ఐదుగురు ముందుకువస్తే వారితో కలిసి చర్చిస్తామని ప్రవీణ చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆందోళన విరమించాలని కోరారు. దీనికి విద్యార్థులు అంగీకరించి, ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Updated Date - Sep 27 , 2025 | 04:44 AM