AP CM and Deputy CM: అది న్యాయవ్యవస్థ పవిత్రతపై దాడి
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:05 AM
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నాగరిక, ప్రజాస్వామిక సమాజంలో...
సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండించిన సీఎం, డిప్యూటీ సీఎం
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నాగరిక, ప్రజాస్వామిక సమాజంలో అలాంటి చర్యలకు ఆస్కారం లేదని సీఎం పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేస్తూ... ‘సీజేఐపై దాడికి చేసిన ప్రయత్నాన్ని బేషరుతుగా ఖండిస్తున్నాం. ఇది ధర్మాన్ని ఉల్లంఘించడమే. హింసకు తావు లేదు’ అని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ కూడా జస్టిస్ గవాయ్‌పై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కూడా హిందూ దేవుళ్లపై సీజేఐ చేసిన వ్యాఖ్యలను సహించలేని సనాతనవాది పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖండించిన బార్ కౌన్సిల్, న్యాయవాదుల సంఘం, ఐలు, ఐఏఎల్
జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించడాన్ని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఖండించింది. ఈ మేరకు ఏపీబార్ కౌన్సిల్ అధ్యక్షుడు నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం సోమవారం వేర్వేరుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) ఈ ఘటనను ఖండించాయి. ఈ మేరకు ఐలు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, అధ్యక్షుడు కె.కుమార్, ఐఏఎల్ జాతీయ కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్ వేర్వేరుగా పత్రికా పకటనలు విడుదల చేశారు.