సహచర మంత్రులతో అచ్చెన్నాయుడు సమీక్ష
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:40 PM
ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు బుధవారం సహచర మంత్రులతో సమీక్షించారు.
ఓర్వకల్లు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు బుధవారం సహచర మంత్రులతో సమీక్షించారు. ముందుగా మండలంలోని నన్నూరు రాగమయూరిలో సహచర మంత్రులు, స్థానిక ఎంపీ, ఉన్నతాధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మీడియా సెంటర్, వీఐపీ రూట్స్, అగ్నిమాపక సదుపాయాల కల్పనను పరిశీలించారు. ఆ తర్వాత సహచర మంత్రులతో సమీక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాధించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విభాగం క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. రవాణా సదుపాయాల సమర్థత నిర్వహణ, పోలీసు యంత్రాంగం పర్యవేక్షణ, సభా నిర్వహణపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. వాహనాల మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై విభాగాధిపతులతో చర్చించారు. కార్యక్రమంలో సహచర మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.