Nara Lokesh: వాజపేయి - చంద్రబాబుది తండ్రీకొడుకుల బంధం
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:02 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ప్రధాని వాజపేయి కుమారుడిలా చూసుకున్నారని, వారిది తండ్రీ కొడుకుల బంధమని మంత్రి లోకేశ్ అన్నారు.
‘అటల్ - మోదీ..’ యాత్రలో లోకేశ్ వెల్లడి.. బందరులో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ
మచిలీపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ప్రధాని వాజపేయి కుమారుడిలా చూసుకున్నారని, వారిది తండ్రీ కొడుకుల బంధమని మంత్రి లోకేశ్ అన్నారు. నైతిక విలువలకు లోబడి రాజకీయాల్లో రాణించిన గొప్ప నేత వాజపేయి అని కొనియాడారు. అటల్-మోదీ సుపరిపాలనా యాత్ర మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకుంది. ఈ సందర్భంగాబైపా్‌సరోడ్డు సెంటరులో ఏర్పాటుచేసిన వాజపేయి విగ్రహాన్ని లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మత్స్యకారుల గ్రామంగా ఉన్న సింగపూర్‌ను అభివృద్ధి చేసిన ఆ దేశ ప్రధానిని, భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన వాజపేయిని తాను ఆదర్శంగా తీసుకుంటానన్నారు. 13 రోజుల వ్యవధిలోనే ప్రధాని పదవిని కోల్పోవలసి వచ్చినా, నైతిక విలువలను పాటించి వాజపేయి రాజీనామా చేశారని అన్నారు. ఆయన బాటలోనే... పాఠశాలల్లో ప్రతి శనివారం విద్యార్థినీవిద్యార్థులకు నైతిక విలువలను బోధించేలా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వాజపేయి నిత్యం అండదండగా ఉన్నారని తెలిపారు. ‘ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం. కానీ, 1983 నుంచే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అమలవుతోంది’ అని వ్యాఖ్యానించారు. వాజపేయి బాటనే ప్రధాని మోదీ అనుసరిస్తున్నారన్నారు. వాజపేయి శతజయంతి సందర్భంగా మంగళగిరిలో ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వర్ల కుమార్‌రాజా, సుజనా చౌదరి, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.