Share News

నత్తనడకన..

ABN , Publish Date - May 31 , 2025 | 01:04 AM

జిల్లాలో గృహ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 86,074 గృహాలు మంజూరైతే ఇప్పటి వరకు 28,666 గృహాలే పూర్తయ్యాయి. 28,415 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉంటే, 28,993 గృహాల నిర్మాణం అసలు ప్రారంభమేకాలేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి గృహ నిర్మాణాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడంలేదు. దీంతో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ బాలాజీ గృహ నిర్మాణశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 నత్తనడకన..

జిల్లాలో గృహ నిర్మాణాల దుస్థితి

- మంజూరైన గృహాల సంఖ్య 86,074

- ఇప్పటి వరకు పూర్తయినవి 28,666

- వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి 28,415

- అసలు నిర్మాణాలే ప్రారంభం కానివి 28,993

- గృహ నిర్మాణశాఖ అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

జిల్లాలో గృహ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 86,074 గృహాలు మంజూరైతే ఇప్పటి వరకు 28,666 గృహాలే పూర్తయ్యాయి. 28,415 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉంటే, 28,993 గృహాల నిర్మాణం అసలు ప్రారంభమేకాలేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి గృహ నిర్మాణాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడంలేదు. దీంతో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ బాలాజీ గృహ నిర్మాణశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో 86,074 గృహాల నిర్మాణానికి గతంలో అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు 28,666 గృహాల నిర్మాణాలను పూర్తిచేశారు. 28,993 గృహాల నిర్మాణాలను అసలు ప్రారంభించనేలేదు. 28,415 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లుగా అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా గృహ నిర్మాణం నిమిత్తం రూ.50 వేలను ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఈ విషయం లబ్ధిదారులకు తెలియజేయకుండా అధికారులు గోప్యత పాటించడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలు నిర్మాణం చేసుకున్న గృహాలకు ప్లాస్టింగ్‌ పనులు పూర్తిచేస్తే రూ.15వేలు, ఇంటిలో నాపరాయి, లేదా ఫ్లోరింగ్‌ పనులు చేస్తే రూ.15వేలు, విద్యుత పనులు, మరుగుదొడ్డి నిర్మాణ పనులు చేస్తే రూ.10 వేలు చొప్పున మొత్తంగా రూ.50 వేలను ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని లబ్ధిదారులకు తెలియకుండా ఉంచడంపై శుక్రవారం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025 మార్చి నెలాఖరు నాటికి గతంలో ప్రారంభించి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 3,783 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా గృహ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఈ నెల 13వ తేదీన కలెక్టర్‌ గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించిన సమయంలో ఈ నెలాఖరులోగా 910 గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పారు. అయితే 412 గృహాల నిర్మాణాలను పూర్తి చేసినట్లుగా అధికారులు లెక్కలు చూపారు.

అధికారులకు హెచ్చరికలు

గృహ నిర్మాణంలో మచిలీపట్నం నగరంతోపాటు, అవనిగడ్డ, కోడూరు, గన్నవరం, చల్లపల్లి, పెదపారుపూడి, కృత్తివెన్ను, మోపిదేవి, గుడివాడ, నాగాయలంక మండలాలు వెనుక బడి ఉన్నట్లుగా కలెక్టర్‌ తన సమీక్షలో తెలియజేశారు. మునిసిపల్‌ కమిషనర్‌లు, ఎంపీడీవోలు, గృహనిర్మాణసంస్థ అధికారులు నిర్లక్ష్యఽ దోరణితో వ్యవహరించడం వలనే గృహ నిర్మాణాలు ముందుకు సాగడంలేదని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. కృత్తివెన్ను మండల ఏఈని పనితీరు మార్చుకోవాలని సూచించారు.

అక్రమార్కులపై చర్యలేవి?

గృహ నిర్మాణాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై అధికారులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. కోడూరు, ఘంటసాల, పెదపారుపూడి మండలాల్లో అధికారులు చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. కోడూరు మండలంలో సిమెంటు, ఇనుము పక్కదారి పట్టిన అంశంపై రెండు రోజుల క్రితం అధికారులు విచారణ పూర్తిచేశారు. అధికారులకు వచ్చిన ఫిర్యాదులో కంటే అధికంగానే సిమెంటు, ఇసుము పక్కదారి పట్టినట్లు తేలిందని ఆ శాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. ఘంటసాల మండలంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు వచ్చిన సిమెంటు, ఇనుమును ఘంటసాలలోని గోడౌన్‌కు తరలించకుండా, కోసూరులోని ప్రైవేట్‌ గోడౌన్‌లో దించుకుని, అక్కడ విక్రయించేసిన అంశంపైనా విచారణ జరుగుతోంది. గతంలో ఘంటసాలలో పనిచేసిన ఏఈ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండు మండలాలకు సంబంధించిన నివేదికలను తయారు చేసి త్వరితగతిన అందజేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వెలువడినట్లు గృహనిర్మాణశాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. పెదపారుపూడి మండలానికి వచ్చిన ఇసుము, సిమెంటును అక్కడకు పంపకుండా, కంకిపాడులో దించేసి గుంపగుత్తగా విక్రయించేసిన అంశంపై ఇటీవల కాలంలో గృహ నిర్మాణశాఖ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో పెదపారుపూడి మండల గృహ నిర్మాణ సంస్థ సిబ్బందిని జిల్లా కార్యాలయానికి పిలిపించి అధికారులు విచారణ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి ఇనుము, సిమెంటును విక్రయించేశారని సిబ్బంది చెప్పారు. ఇందులో బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 31 , 2025 | 01:04 AM