Veeraswamy Anburusu: అవును.. నేను విన్నాను
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:47 AM
అవును.. నేను విన్నాను. జయచంద్రారెడ్డి ఇంట్లోనే నకిలీ మద్యం తయారీపైన చర్చ జరిగింది. నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే భారీగా లాభాలు...
పోలీసులకు సహాయకుడు వీరస్వామి అన్బురసు వాంగ్మూలం
డైరీలో సంతకం చేసి కట్టా రాజు దగ్గర రూ.8 లక్షలు తెచ్చా
జయచంద్రారెడ్డి సూచనతో ఆ నగదు పీఏ రాజేశ్ చేతికి
ఇంట్లోని స్కార్పియోలోనే నకిలీ మద్యం సరఫరా
ఆయన, గిరిధర్‌రెడ్డి, జనార్దన్‌రావు కలసి పనిచేశారు
ఆయన ఆదేశాలతో నా ఫోన్‌ను ధ్వంసం చేశా
ములకలచెరువు కేసులో అన్బురసు రిమాండ్ రిపోర్టు
రాయచోటి/ములకలచెరువు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘అవును.. నేను విన్నాను. జయచంద్రారెడ్డి ఇంట్లోనే నకిలీ మద్యం తయారీపైన చర్చ జరిగింది. నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే భారీగా లాభాలు వస్తాయని అద్దేపల్లె జనార్దన్‌రావు చెప్పారు. ఇందుకు జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, రాజేశ్ అంగీకరించారు. జయచంద్రారెడ్డి తరఫున నకిలీ మద్యం తయారీ ప్లాంటుకు వెళ్లి కట్టా రాజు డైరీలో సంతకం చేసి రూ.8 లక్షల నగదు తీసుకొచ్చాను. జయచంద్రారెడ్డి సూచన మేరకు ఆ మొత్తాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాజేశ్‌కు ఇచ్చాను’’.. అని ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు, టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి ఇంట్లో పనిమనిషి వీరస్వామి అన్బురసు అలియాస్ బాబు ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ, విక్రయం కేసులో ఏ19గా ఉన్న వీరస్వామి అన్బురసును ఈ నెల 10న ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. 11వ తేదీ రాత్రి తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచి, 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
కోర్టుకు సమర్పించిన వీరస్వామి అన్బురసు రిమాండ్ రిపోర్టు ప్రకారం.. 2021 నుంచి జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023లో జయచంద్రారెడ్డి ఇంట్లో నెలకు రూ.15 వేల వేతనంతో.. వ్యవసాయ పొలాలు, తోటల్లో పనులు పర్యవేక్షించే సహాయకుడుగా చేరాడు. 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి టికెట్ రావడంతో.. ఆయన స్నేహితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు(ఏ1) విజయవాడ నుంచి వచ్చి ఎన్నికల ప్రచారం, ఇతర వ్యవహారాలను చూసుకునేవాడు. ములకలచెరువు మండలంలో జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్, పెద్దతిప్పసముద్రం మండలంలో కట్టా సురేంద్రనాయుడు పేర్ల మీద మద్యం దుకాణాలకు అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దుకాణాలలో నష్టాలు వచ్చాయి. దీంతో ఈ రెండు దుకాణాల నిర్వహణను తాను చూసుకుంటానని జనార్దన్‌రావు.. జయచంద్రారెడ్డి ఇతరుల సమక్షంలో ఒప్పుకొన్నాడు. నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తే భారీగా లాభాలు వస్తాయని జనార్దన్‌రావు చెప్పాడు. ఆ మాటలను అప్పుడు అక్కడే ఉన్న వీరస్వామి విన్నాడు. నకిలీ మద్యం తయారీకి బెంగళూరుకు చెందిన బాలాజీ స్పిరిట్, ముడి పదార్థాలు సరఫరా చేస్తాడని జనార్దన్‌రావు చెప్పడంతో అందరూ అంగీకరించారు.
జనార్దన్‌రావు సూచనల మేరకు ఆయన తరఫున నకిలీ మద్యం తయారీ ప్లాంటుకు వెళ్లి మూడు దఫాలుగా మొత్తం రూ.8 లక్షలు తీసుకుని కట్టా రాజు డైరీలో వీరస్వామి అన్బురసు సంతకం చేశాడు. తరువాత జయచంద్రారెడ్డి సూచనల మేరకు ఆ నగదును రాజేశ్‌కు అందజేశాడు. నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసేందుకు జనార్దన్‌రావు.. అన్బురసుకు ఫోన్ చేసి జయచంద్రారెడ్డి ఇంట్లో ఉన్న నలుపు రంగు స్కార్పియో వాహనం తాళాలు డ్రైవర్ అష్రఫ్ (ఏ21) వచ్చినప్పుడల్లా ఇవ్వమని చెప్పాడు. డ్రైవర్ అష్రఫ్ నకిలీ మద్యం పెట్టెలను ఆ వాహనంలో తీసుకెళ్లి బెల్ట్‌షాపులకు సరఫరా చేసేవాడు. స్కార్పియోలో నకిలీ మద్యం సరఫరా జరుగుతోందని జయచంద్రారెడ్డికి తెలుసు. జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, జనార్దన్‌రావు, రాజేశ్, కట్టా రాజు తరచూ నకిలీ మద్యం తయారీతో భారీ లాభాలు సంపాదించాలని సమన్వయంతో పనిచేశారు. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె తదితర మండలాల్లోని బెల్టుషాపులకు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు.