Share News

AP Legislative Assembly: ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:32 AM

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. విపక్ష వైసీ పీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకున్నా స్వపక్షమే విపక్షం అవతారమెత్తి సమస్యలపై గళం వినిపించింది.

AP Legislative Assembly: ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

  • 8 రోజులపాటు సభ.. 23 బిల్లులకు ఆమోదం

  • ప్రజాసమస్యలపై అధికార పక్షమే విపక్షమై గళం

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. విపక్ష వైసీ పీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకున్నా స్వపక్షమే విపక్షం అవతారమెత్తి సమస్యలపై గళం వినిపించింది. సమావేశా లు ఈనెల 18న ప్రారంభమై 27తో ముగిశాయి. టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు సభలో వివిధ ప్రజాసమస్యలు లేవనెత్తారు. టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ, కాలుష్య నియంత్రణ, రోడ్లు, వంతెనల దుస్థితి.. తదితర సమస్యలను ప్రస్తావించారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత అజెండా కోసం అసెంబ్లీని వేదికగా చేసుకోవడం.. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్‌ కావడం.. చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌ రెడ్డి, కూన రవికుమార్‌, బొండా ఉమ వంటి వారు ప్రస్తావించిన అంశాలను సీఎం సీరియ్‌సగా తీసుకున్నారు. ఇవన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చేకన్నా.. సభ్యుల వ్యక్తిగత అజెండాలకు ప్రాధాన్యమిచ్చేలా ఉన్నాయన్నారు. తొలిరోజు జీఎస్టీపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌(పీపీటీ) ఇచ్చిన సీఎం చంద్రబాబు సమావేశాలు జరిగిన ప్రతిరోజూ స్వల్పకాలిక చర్చపై ప్రజంటేషన్‌ ఇస్తూ వచ్చారు. రెండో రోజు నీటిపారుదల రంగంపై, మూడో రోజు వ్యవసాయంపై, నాలుగో రోజు ఆరోగ్య రంగంపై పీపీటీ ద్వారా సభ్యులకు సమాధానమిచ్చారు. ఆరో రోజు పెట్టుబడులు, లాజిస్టిక్స్‌పై, ఏడో రోజు సూపర్‌ సిక్స్‌పై పీపీటీ ఇచ్చారు. ఈ సమావేశాలు 8 రోజులపాటు జరిగ్గా 23 బిల్లులు ఆమోదం పొందాయి. మూడు బిల్లులు ఉపసంహరించుకోగా, 6 అంశాలపై లఘు చర్చ జరిగింది.


మండలిలో గరం.. గరం

శాసనమండలిలో వైసీపీ ఆధిపత్యం ఉండటంతో సమావేశాలు గరం.. గరంగా సాగాయి. సమావేశాల చివరి రోజైన శనివారం వైసీపీ ఎమ్మెల్సీలు కాఫీ బాగోలేదంటూ లేవనెత్తిన వివాదం ప్రజా సమస్యలపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చాటింది. ప్రజాసమస్యలను గాలికొదిలేసి కాఫీ .. టీపై గొడవ ఏమిటంటూ అధికారపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. కాగా, మండలి సమావేశాలు 8 రోజులు జరిగాయి. మొత్తం 22 బిల్లులు ఆమోదం పొందగా, 3 బిల్లులను వెనక్కి తీసుకున్నారు. 4 తీర్మానాలను ఆమోదించారు.

Updated Date - Sep 28 , 2025 | 05:32 AM