Assembly Privilege Committee: పునరావృతమైతే కఠిన చర్యలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:01 AM
కడప రిమ్స్‌లో క్యాథ్‌ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్‌వోలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రిమ్స్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ హెచ్చరిక
నోటీసు ఇచ్చినా గత విచారణకు గైర్హాజరవడంపై ఆగ్రహం
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): కడప రిమ్స్‌లో క్యాథ్‌ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్‌వోలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. చైర్మన్ పితాని సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైంది. కమిటీ ముందు హాజరుకావాలని నోటీసు ఇచ్చినా పట్టించుకోకుండా గత విచారణకు ఇద్దరూ గైర్హాజరవడంపై మండిపడింది. ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరినీ హెచ్చరించింది. పూర్తి వివరాలతో తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రిమ్స్‌లో క్యాథల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని కడప ఎమ్మెల్యే, విప్ రెడ్డప్ప గారి మాధవీరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో తాను అనేక ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందనా లేదని ఎమ్మెల్యే జోగేశ్వరరావు చేసిన ఫిర్యాదులపైనా ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. సోమవారం మరోసారి సమావేశమైన కమిటీ.. శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు ఎందుకు వేయలేదని అప్పటి రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్‌ను ప్రశ్నించింది. తనకు ప్రోటోకాల్ తెలియదని, అప్పటి డీఆర్‌వోను అడిగిన తర్వాత ఎమ్మెల్యే పేరు చేర్చి కొత్త శిలాఫలకం ఆవిష్కరించామని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. జరిగిన పొరపాటుకు కమిటీ ముందు క్షమాపణ చెప్పారు.
పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, గత వాయిదాకు ఎందుకు రాలేదని డీఆర్‌వో, మెడికల్ సూపరింటెండెంట్‌లను కమిటీ ప్రశ్నించింది. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ప్రివిలేజ్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లైందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది. డీఆర్‌వో పేపర్లు చూస్తూ సమాధానం ఇవ్వడంపైనా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ఎమ్మెల్యేల పట్ల అగౌరంగా ఉంటున్నారని, తీరు మారడం లేదని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, తాను వైద్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తే.. ఆ సమావేశాలకు వెళ్లవద్దని అప్పటి మెడికల్ సూపరింటెండెంట్ మెసేజ్‌లు పంపారని తెలిపారు.