Interstate Criminals: విమానంలో వచ్చి రైళ్లలో చైన్ స్నాచింగ్
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:44 AM
అసోం నుంచి దర్జాగా విమానాల్లో వస్తారు. రైళ్లలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. తిరిగి దర్జాగా విమానాల్లో అసోం వెళ్లిపోతారు. ఇలా పలు రైళ్లలో వరుస చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న..
నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
సూత్రధారి అసోంకు చెందిన సంజోయ్‌రాయ్
పోలీసు కస్టడీలో నిందితులు
గుంటూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): అసోం నుంచి దర్జాగా విమానాల్లో వస్తారు. రైళ్లలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. తిరిగి దర్జాగా విమానాల్లో అసోం వెళ్లిపోతారు. ఇలా పలు రైళ్లలో వరుస చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న.. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గతనెలలో కృష్ణా కెనాల్ వద్ద వరుసగా జరిగిన నేరాలకు సంబంధించి ముఠాలోని ప్రధాన నిందితుడు సంజోయ్‌రాయ్‌తోపాటు హరియాణాలోని హిసార్ పరిధిలోని సత్రోద్ కలాన్‌కు చెందిన సతేందర్‌కుమార్, రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పరిధిలోని బిలోతి కా నార్లా గ్రామానికి చెందిన సతీష్‌గుజ్జర్, సవాయి మాథోపూర్ జిల్లా గంగాపూర్ నగర్‌కు చెందిన రవికుమార్‌ను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, తిరిగి కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు పరిధిలో ఈ ముఠాపై 15 కేసులు ఉన్నాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, సికింద్రాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున కేసులు ఉన్నట్లు గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, సీఐ అంజిబాబు తెలిపారు. కాగా, గుంటూరు రైల్వే పోలీసులిచ్చిన సమాచారంతో చెన్నైలో మరో నిందితుడిని అరెస్టు చేశారు.
ఆధారాలు దొరక్కుండా..
సంజోయ్‌రాయ్ నేతృత్వంలో మొత్తం 15మంది సభ్యులు గల ఈ అంతరాష్ట్ర ముఠా 2015 నుంచీ రైళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతోంది. గతంలో ఒకసారి తమిళనాడులోని జోలార్‌పేట్ రైల్వే పోలీసులు 20 కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ ముఠాను అరెస్ట్ చేసినా, బయటికి వచ్చేశారు. వీరిపై ఏపీ, తెలంగాణ, ఒడిశా, అసోం, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో స్నాచింగ్, దోపిడీ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. కృష్ణా కెనాల్ వద్ద రైలులో నేరానికి పాల్పడిన సంజోయ్‌రాయ్ ఎలాంటి ఆధారాలూ దొరకనివ్వకుండా అక్కడ మరో రైలు ఎక్కి గుంటూరు చేరుకున్నాడు. గుంటూరు స్టేషన్‌లో దిగకుండా మూడు వంతెనల సమీపంలో రైలు దిగి అక్కడ నుంచి బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని విమానంలో గౌహతి వెళ్లిపోయాడు. సాంకేతిక ఆధారాలతో సంజోయ్‌రాయ్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సంజయ్‌రాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడేందుకు ప్రశాంతి, నర్సాపూర్ తదితర రైళ్లు ఎంచుకున్నారు. వ్యాపారుల్లా, ధనవంతుల్లా బిల్డప్ ఇస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా రైళ్లల్లో కిటికీల పక్కన ఉన్న ప్రయాణికులను, రాత్రివేళ నిద్రపోయే ప్రయాణికులను గమనించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడతారు. ప్రయాణికులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మిగిలిన వారంతా ఎదురుదాడికి దిగి కదుతున్న రైలు నుంచి దూకి పారిపోతారు. తిరిగి దర్జాగా విమానంలో అసోం వెళ్లిపోతారు.