Task Force and Excise Police: కొండాపూర్ రేవ్ పార్టీ సూత్రధారి కాజ వాసి
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:25 AM
హైదరాబాద్ కొండాపూర్‌లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీకి సంబంధించి కీలక సూత్రధారి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన...
వీకెండ్‌లో హైదరాబాద్‌లో అశోక్ జల్సాలు
మంగళగిరి, జూలై 28(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కొండాపూర్‌లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీకి సంబంధించి కీలక సూత్రధారి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన అప్పికట్ల అశోక్ కుమార్ నాయుడుగా టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అశోక్ తండ్రి పాములు నాగార్జున వర్సీటీలో వంట పని చేస్తుంటారు. ఆయన భూముల రేటు తక్కువగా ఉన్నప్పుడు సుమారు 20 ఎకరాలు కొనుగోలు చేయడంతో వాటి ధరలు అమాంతం రూ.కోట్లలో పెరిగిపోయాయి. కొంత భూమి అమ్మిన డబ్బుతో అశోక్‌కుమార్ వీకెండ్‌లో ఏపీ నుంచి యువతను హైదరాబాద్ తీసుకువెళ్లి పార్టీల పేరిట జల్సాలు చేసేవాడు. కాజ గ్రామానికే చెందిన నాగళ్ల మణికంఠ సాయి అనే యువకుడు కూడా అశోక్ కుమార్‌కు రేవ్ పార్టీల్లో సహకరిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఏపీ39ఎ్‌సఆర్0001 నంబరు కలిగిన నలుపు రంగు ఫార్చ్యునర్ కారుకు అశోక్‌కుమార్ రాజ్యసభ ఎంపీ స్టిక్కర్ అతికించుకుని తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ రేవ్ పార్టీలో మంగళగిరికి చెందిన అశోక్‌కుమార్ కీలకంగా వ్యవహరించాడనే వార్త ఈ ప్రాంత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.