Share News

Resignation: రాజు వెడలె

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:32 AM

పుట్టుకతోనే అశోక్‌గజపతి...రాజు. చుట్టూ పరివారం.. ఆపై రాజసౌధం. బాల్యం నుంచి దర్పం, దర్జా అన్నీ చూశారు. కానీ అవేవీ ఆయనకు సాంత్వన చేకూర్చలేదు. సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు.

Resignation: రాజు వెడలె
Resignation

  • కోట దాటి నాడు ప్రజా జీవితంలోకి..

  • 40 ఏళ్లపాటు టీడీపీకి, ఏపీకి నిస్వార్థ సేవ

  • గోవా గవర్నర్‌గా బాధ్యతల కారణంగా పార్టీ సభ్యత్వానికి అశోక్‌గజపతి రాజీనామా

  • ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా సెలవు

  • మచ్చలేని నాయకుడిగా అరుదైన గుర్తింపు

  • రాజకీయాల్లో రాజసం ఆయన ప్రత్యేకత

  • ఆర్థికశాఖ సహా పలు కీలక పదవులకు న్యాయం

  • విమానయాన శాఖ మంత్రిగానూ సేవలు

(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

పుట్టుకతోనే అశోక్‌గజపతి...రాజు. చుట్టూ పరివారం.. ఆపై రాజసౌధం. బాల్యం నుంచి దర్పం, దర్జా అన్నీ చూశారు. కానీ అవేవీ ఆయనకు సాంత్వన చేకూర్చలేదు. సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ప్రజా జీవితాన్ని దగ్గరుండి చూశారు. ప్రజాసేవే పరమావధిగా అడుగులు వేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలతో మమేకమై పనిచేశారు. అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా.. అవినీతి మచ్చలేని నేతగా గుర్తింపు పొందారు. గోవా గవర్నర్‌గా నియమితులైన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నారు. విలువలతో కూడిన రాజకీయం రాజు సొంతం. కొందరు దానిని అసమర్థత అన్నా, మరికొందరు రాజకీయం తెలియనివాడు అన్నా.. రాజకీయంలో రాజసం ఆయన శైలి. దాన్ని చేసి చూపించారు. ఐదు దశాబ్దాల పాటు విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఆ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క విజయనగరంలో తప్ప. అప్పటికీ ఇప్పటికీ అశోక్‌ బంగ్లానే అక్కడ తెలుగుదేశం కార్యాలయం.


హేమాహేమీలతో...

అది 1978 సంవత్సరం. జాతీయ కాంగ్రెస్‌తో పాటు ఇందిరా కాంగ్రెస్‌ సైతం బరిలో దిగింది. జనతా పార్టీతో పాటు కమ్యూనిస్టులు పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో జనతాపార్టీ తరఫున విజయనగరం నుంచి నూనుగు మీసాలతో అసెంబ్లీలో అడుగుపెట్టారు అశోక్‌గజపతిరాజు. అప్పుడే పులివెందుల నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రగరి నుంచి చంద్రబాబు గెలిచి అసెంబ్లీకి వచ్చారు. గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ నుంచి గెలిచారు. అనంతర కాలంలో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు అశోక్‌ టీడీపీలో చేరారు. ఎన్టీఆర్‌ పార్టీ ప్రకటించినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. అది మొదలు.. నేటి వరకూ తెలుగుదేశం పార్టీకి సుశిక్షుతుడైన నాయకుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేయని పదవి లేదు.

అజాతశత్రువు..

అశోక్‌గజపతిరాజు అజాతశత్రువుగా పేరుపొందారు. ఐదు ప్రధాన శాఖలకు మంత్రిగా ఉంటూ, శాసనసభ వ్యవహారాలు కూడా ఆయన పర్యవేక్షించారు. కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. 2014లో ఎంపీగా గెలిచి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి 2024 వరకూ వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతు కృషి చేశారు. స్వయంగా తాను పోటీ నుంచి తప్పుకొని విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా అదితి గజపతిరాజు, విజయనగరం ఎంపీ స్థానం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Updated Date - Jul 19 , 2025 | 04:33 AM