Share News

Emotional Resignation: అశోక్‌ కంటతడి

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:39 AM

టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరో పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు, పల్లా శ్రీనివాస్‌కు మెయిల్స్‌ ద్వారా, రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపారు.

Emotional Resignation: అశోక్‌ కంటతడి
Emotional Resignation

  • పార్టీకి రాజీనామా సమయంలో తీవ్ర భావోద్వేగం

సింహాచలం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరో పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు, పల్లా శ్రీనివాస్‌కు మెయిల్స్‌ ద్వారా, రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపారు. రాజీనామా చేసే సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తొలుత ఆయన వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద రాజీనామా పత్రంపై సంతకం పెడుతూ... భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నేటివరకూ టీడీపీని వీడలేదు. అందరి మన్ననలతో ఎన్నో పదవులు చేపట్టి ఎటువంటి అపకీర్తి లేకుండా పనిచేసే శక్తిని అప్పన్నస్వామి ప్రసాదించడం అదృష్టంగా భావిస్తున్నాను. గవర్నర్‌ పదవి అనేది రాజ్యాంగపరమైన బాద్యత కావటంతో టీడీపీకి రాజీనామా చే య్యాల్సి వచ్చింది. బాధగా ఉన్నా.. దేశం కోసం సేవలందించాలని పెద్దలు సూచించటంతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను. గవర్పర్‌ పదవి మరింతగా నా బాధ్యతలను పెంచింది.’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎన్‌డీఏ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగానికి, న్యాయానికి కట్టుబడి కొత్త పాత్రని సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. కాగా, అశోక్‌గజపతిరాజు లేని టీడీపీని ఊహించుకోలేం అంటూ టీడీపీ శ్రేణులు ఉద్వేగానికి గురి అవుతున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నాయి.

Updated Date - Jul 19 , 2025 | 04:41 AM