Share News

Asha Kiran: ప్రజా క్షేత్రంలోకి రంగా కుమార్తె

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:35 AM

రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు మద్దతుగా నిలుస్తానని దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్‌ తెలిపారు.

Asha Kiran: ప్రజా క్షేత్రంలోకి రంగా కుమార్తె

  • అన్ని వర్గాలకు అండగా ఉంటా

  • రాధా-రంగా మిత్రమండలిని బలోపేతం చేసేలా ప్రయత్నిస్తా: ఆశా కిరణ్‌

విజయవాడ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు మద్దతుగా నిలుస్తానని దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తాను ప్రజా క్షేత్రంలోకి అడుగు పెడుతున్నట్టు చెప్పారు. వంగవీటి రాధా(రంగా సోదరుడు) 20వ జయంతి నేపథ్యంలో పాలకొల్లులో నిర్వహిస్తున్న కాపు వనభోజనాల్లో పాల్గొనటానికి వెళ్లే క్రమంలో ఆదివారం ఆమె విజయవాడలోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఇకనుంచి ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నా. రాజకీయాల్లో ప్రవేశానికి సంబంధించి ప్రస్తుతం ఆలోచన లేదు. రానున్న రోజుల్లో రాధా-రంగా మిత్రమండలి పెద్దలతో చర్చించి సలహాలు తీసుకుంటా. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టత ఇస్తా. ప్రస్తుతం పాలకొల్లులో కాపు వనభోజనాలకు వెళ్తున్నా. అక్కడ రాధా-రంగా మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు, శ్రేయోభిలాషులను కలుస్తా. నేను ఒక కులం ప్రాతిపదికన పనిచేయను. వంగవీటి రంగాకు కుల, మత భేదాలు లేవు. అన్ని వర్గాలను ఆయన సొంతం చేసుకున్నారు. అలానే నేను కూడా అన్ని వర్గాలకు అండగా ఉండాలని నిశ్చయించుకున్నా. రాధా-రంగా మిత్రమండలి బలోపేతానికి కూడా చర్యలు తీసుకుంటా. మిత్రమండలికి సంబంధించి కొంత గ్యాప్‌ ఉంది. అన్నయ్య రాధాకృష్ణ ఆ గ్యాప్‌ను పూడ్చటానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలపై ఆలోచన ఉంటే రాధా-రంగా మిత్రమండలితో చర్చించాకే ప్రకటిస్తా.’’ అని ఆశా కిరణ్‌ చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఒకే రక్తం పంచుకుని పుట్టినవాళ్లం కాబట్టి ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఏదైనా ఉన్నా.. ఆయన సహకారం తనకెప్పుడూ ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాజకీయం ఏంటనేది ఇరువురి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఇప్పుడే దీనిపై చెప్పలేమన్నారు. దారులు వేరైనా తమ ఇద్దరి గమ్యం ఒకటేనన్నారు. ఉభయ రాష్ర్టాల్లో రంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటానని, అండగా ఉంటానన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 04:37 AM