నీకింత.. నాకింత
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:10 AM
లస్కర్లు కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో పనిచేసే సిబ్బంది.
ఇరిగేషనలో కొనసాగుతున్న దందా
అవుట్ సోర్సింగ్ లస్కర్ల తప్పుడు హాజరు పట్టిక
అదనపు ఆదాయం కోసం అధికారుల కక్కుర్తి
ఒక్కో లస్కర్ నుంచి రూ.6 వేల నుంచి రూ.7వేల వసూళ్లు
కమీషన్ రూపంలో నెలకు రూ.లక్షల ఆదాయం
డైవర్షన్ పేరుతో తరుచూ లస్కర్ల బదిలీలు
ఇరిగేషన్ శాఖలో ఇదో మాయాజాలం
లస్కర్లు కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో పనిచేసే సిబ్బంది. వీరు నీటి విడుదలను పర్యవేక్షించడం.. కాల్వలకు గండి పడకుండా చూడటం.. జల చౌర్యాన్ని అడ్డుకోవడం వంటి పనులు చేస్తారు. ఎంతటి కీలకమైన విధులు నిర్వహించే సిబ్బందే నామకే వాస్తేగా ఉంటే ఇక ఆలోచించండి రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇరిగేషన శాఖ అధికారుల అదనపు ఆదాయ కక్కుర్తికి అన్నదాతలు బలైపోతున్నారు. లస్కర్ల తప్పుడు హాజరు పట్టికను తయారుచేసి వారు విధులకు రాకున్నా వచ్చినట్లు చూపి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఒక్కో లస్కర్ నుంచి రూ.6వేల నుంచి రూ.7వేల కమీషన్లు తీసుకుంటూ ధనార్జనకు పాల్పడుతున్నారు. లస్కర్లు లేకపోవడంతో జలచౌర్యం రోజురోజుకూ పెరిగిపోయింది. ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం గగనమైపోతోంది.
కోడుమూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌శాఖలోని తుంగభద్ర ప్రా జెక్టు(టీబీపీ), జీడీపీలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు జీతం కంటే ప్రతి నెల అవుట్ సోర్సింగ్ లస్కర్ల నుంచి కమీషన్ రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువ. ప్రతి నెల సుమారుగా రూ.5లక్షల వరకు చేతులు మారుతున్నాయి. ఈ ఆదాయం కోసం కొంత మంది అధికారులు కొన్నేళ్ల నుంచి ఇక్కడే తిష్ఠవేసి పోటీపడి రూ.లక్షలు సం పాదిస్తున్నారు. ఎల్లెల్సీ పరిధిలోని నాలుగు సబ్ డివిజన్లలో మొత్తం 116 మంది లస్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. టీబీపీ కోడుమూరు సబ్‌డివిజన్‌లో 64మంది, ఆదోని1 సబ్‌డివిజన్‌లో 13, ఆదోని2 సబ్‌డివిజన్‌లో 13, ఎమ్మిగనూరు సబ్ డివి జన్‌లో 17, జీడీపీ సబ్‌డివిజన్‌లో 9మంది పనిచేస్తున్నారు.
నెలకు రూ.20వేల వేతనం
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.20వేలు నెలకు వేతనం ప్రభుత్వం విడుదల చేస్తోంది. పేరుకే అవుట్ సోర్సింగ్ లస్కర్లు. ఆఫీసు రికార్డుల్లో మాత్రమే వీళ్ల పేరు కనిపిస్తాయి. విధుల్లో మాత్రం కనిపించరు. నెలకు వచ్చే రూ.20వేల జీతం మాకు సరిపోవడం లేదని 90శాతం మంది లస్కర్లు విధులకు హాజరు కావడం లేదు. బయటి మార్కెట్లో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, కుల వృత్తి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
అధికారులతో ఒప్పందం
లస్కర్లు విధులకు హాజరవుతున్నట్లు రికార్డులు సృష్టించి తమకు నెలనెలకు జీతం ఇస్తే ఇందుకు ప్రతిఫలంగా నెలకు కొంత డబ్బు ఇస్తామని లస్కర్లంతా అధి కారులతో ఒప్పందం కుర్చుకున్నారు. తాము ఏమి చేసినా అడిగే వాళ్లు లేరని ఇక్కడి అధికారుల ధీమా. దీంతోనే అవుట్ సోర్సింగ్ లస్కర్లు ప్రతి రోజు విధులకు హాజరవుతున్నారని హాజరుపట్టికను సృష్టించి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. ఇందుకు ప్రతి ఫలంగా ఒక్కొక్క లస్కర్ నుంచి నెలకు రూ.6వేల నుంచి 7వేల చొప్పున అధికారులు లంచం తీసుకొంటున్నారు. ఇదంతా బహిరంగ రహస్యం.
ఫిర్యాదు చేసినా...
విధులకు ఎగ్గొట్టే లస్కర్ల నుంచి లంచం తీసుకొంటున్నారని గతంలో కొంత మంది లస్కర్లు లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులపై కూడా రైతులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. పైస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు వాటాలు పంచుకొంటున్నారని రైతుల నుంచి ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వాన్ని మోసగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పట్టుమని 10 మంది కూడా..
కోడుమూరు ఎల్లెల్సీ సబ్‌డివిజన్‌లో 64మంది అవుట్ సోర్సింగ్ లస్కర్లు పని చేస్తున్నారు. 64 మందిలో 10మంది కూడా విధులకు హాజరుకావడం లేదు. కోడుమూరులోని కొంత మంది లస్కర్ల పేర్లను డైవర్షన్ పేరుతో ఎమ్మిగనూరు, ఆదోని1, ఆదోని2 సబ్‌డివిజన్లు బదిలీ చేస్తున్నారు. ప్రతినెల లస్కర్ల దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేసుకొని ఒకప్రణాళిక ప్రకారం అధికారులు చేతులు మార్చుకొం టున్నట్లు సమాచారం. ఇరిగేషన్‌శాఖలో డైవర్షన్ అనేది ఇదొక మాయజాలం.
ఏఈలు కొన్నేళ్లుగా తిష్ఠ
టీబీపీ కోడుమూరు సబ్‌డివిజన్ పనిచేస్తున్న కొంత మంది ఏఈలు కొన్నేళ్లుగా ఇక్కడే తిష్ఠ వేశారు. అధికార పార్టీలోని కొంత మంది చోటామోటా నాయకులకు కొంత డబ్బులు ముట్టజెప్పి వాళ్ల ఉద్యోగా లను భద్రపరుచుకొని నెలకు రూ.లక్షల ఆదాయం పొందుతున్నారు. కోడుమూరు సబ్‌డివిజన్‌లోని కొంత మంది ఏఈలు సెక్షన్లు మారు తూ 7నుంచి 12 సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారంలో ఒకటి లేదా రెండు రోజలు మాత్రమే చుట్టపు చూపుగా విధులకు హాజరవుతున్నారనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది ఏఈలు అవుట్ సోర్సింగ్ లస్కర్ల స్థానంలో ప్రైవేటు వ్యక్తులను నియమిం చుకొని సాగునీరందిస్తూ రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేయిస్తున్నట్లు సమాచారం.
2012లో అవుట్ సోర్సింగ్ లస్కర్ నియమించిన ప్రభుత్వం :
శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు పోగొట్టుకొన్న బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకొంది. ఇందులో భాగంగా జీవన భృతి కింద ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2012, 2013, 2014లో ముంపు బాధిత కుటుంబంలోని ఒకరికి చొప్పున సుమారు 650మందిని అవుట్ సోర్సింగ్ లస్కర్లుగా నియమిస్తూ జీవో విడుదల చేశారు. నియమితులైన అవుట్ సోర్సింగ్ లస్కర్లను కేసీ కెనాల్, ఎల్లెల్సీ, ఎంఐ, ఎస్‌ఆర్‌బీలకు కేటాయించారు.
లస్కర్ల విధులు
ప్రతి లస్కర్ వారికి కేటాయించిన కాల్వ ప్రాంతంలోని రైతులకు అందుబాటులో ఉండాలి. కాల్వ నుంచి వచ్చే సాగునీరు రైతుల పొలాలకు అందేలా చూడాలి. జలచౌర్యం అడ్డుకోవాలి. తూముల బాధ్యతలు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలి. కాల్వ జీపు ట్రాక్‌కు గుంతలు పడకుండా సరి చేయాలి. కాల్వలో కంప చెట్లను తొలగించి సక్రమంగా కిందికి నీరు వెళ్లే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కోడుమూరు సబ్ డివిజన్‌లో 90 శాతం మంది అవుట్ సోర్సింగ్ లస్కర్లు విధులకు రావడం లేదు. దీంతో కాల్వల పరిస్థితిని పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. ఫలితంగా కాల్వలో ముళ్లకంపలు పెరిగి కొన్ని పాంత్రాల్లో కాల్వలు శిథిలావస్థకు చేరుకొన్నాయి.