Share News

AP Police: అరుణ అరాచకం

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:32 AM

పోలీసు అధికారులనే ఒక ఆటాడించిన, ఐఏఎస్‌ అధికారులనూ గుప్పిట పట్టిన, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన కిలేడీ నిడిగుంట అరుణ ‘కిరాయి హత్యల చరిత్ర బయటపడుతోంది. ఆమె మొబైల్‌ ఫోన్‌లో కాల్‌డేటా తీగలాగితే...

 AP Police: అరుణ అరాచకం

  • సూళ్లూరుపేటలో కిరాయి హత్య

  • తండ్రి హత్యకు సుపారీ ఇచ్చిన ఓ వ్యక్తి

  • నాడు సహజ మరణం ఖాతాలోకి

  • నేడు.. అరుణ మొబైల్‌లో తేలిన నిజం

  • మరొకరి ఆత్మహత్యకూ కారణమైన ముఠా

  • మాజీ ఎమ్మెల్యే కిలివేటితో కిలేడీ బంధం

  • ఆయన తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

  • ఆమె ఎన్నికల ఏజెంటుగా వైసీపీ ఎంపీపీ

(తిరుపతి - ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులనే ఒక ఆటాడించిన, ఐఏఎస్‌ అధికారులనూ గుప్పిట పట్టిన, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన కిలేడీ నిడిగుంట అరుణ ‘కిరాయి హత్యల’ చరిత్ర బయటపడుతోంది. ఆమె మొబైల్‌ ఫోన్‌లో కాల్‌డేటా తీగలాగితే... మొత్తం నేరాల డొంక కదులుతోంది. అప్పుడెప్పుడో ‘సహజ మరణం’గా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్‌ చంపించినట్లుగా తేలింది. రౌడీషీటర్‌ అవిలేలి శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇప్పించడానికి పైస్థాయిలో పైరవీలు నడిపిన అరుణను ఇటీవల నెల్లూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆమె మొబైల్‌ ఫోన్‌ నుంచి సేకరించిన కాల్‌ రికార్డింగ్‌లను పరిశీలించే క్రమంలో సూళ్లూరుపేటలో జరిగిన ఒక హత్య సంగతి వెలుగులోకి వచ్చింది. ఆ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఆస్తి మొత్తం చిన్న భార్యకు రాసిస్తాడనే అనుమానంతో పెద్ద భార్య కొడుకే.. తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు పోలీసులకు క్లూ లభించింది. ఇంతకాలం సాధారణ మరణంగా భావించిన ఈ వ్యవహారం ఇప్పుడు హత్యగా తేలింది. సుపారీ ఇచ్చిన వ్యక్తి సూళ్లూరుపేటలో కూటమిలోని ఒక పార్టీ నాయకుడు. తండ్రిని చంపించిన సంగతి పోలీసులకు తెలిసిందని ఉప్పందడంతో ఆయన గుండెనొప్పి సాకుతో నెల్లూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అలాగే సూళ్లూరుపేట పాలవల్లివారి వీధిలో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అరుణ గ్యాంగ్‌ వేధింపులే కారణమన్న సంగతీ వెలుగు చూసినట్లు తెలిసింది.


కిలివేటితో అరుణ బంధం

నిడిగుంట అరుణ వైసీపీ నేతలతో ఎంత అంటకాగారో వెలుగులోకి వస్తోంది. సూళ్లూరుపేట అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో, మండలాధ్యక్షుడు, వైసీపీ మండల కన్వీనర్‌ అనిల్‌కుమార్‌ రెడ్డితో ఆమె సన్నిహితంగా మెలిగేది. సంజీవయ్య వెంటే ఉంటూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. గత ఎన్నికల సమయంలో తనకు వైసీపీ టికెట్‌ దక్కదేమోనని సంజీవయ్య సందేహించారు. అదే జరిగితే అరుణను ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి వైసీపీ ఓట్లు చీల్చాలని భావించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే సంజీవయ్యకే టికెట్‌ ఖరారైంది. అయినప్పటికీ అరుణను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు అనిల్‌కుమార్‌ రెడ్డి జనరల్‌ ఏజెంటుగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఆమెకు డైమండ్‌ గుర్తు కేటాయించగా.. 494 ఓట్లు వచ్చాయి. సంజీవయ్య నివాసం, వ్యాపారాలూ రెండూ నెల్లూరులోనే. అనిల్‌ కుమార్‌రెడ్డి సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడు. వారిద్దరికీ అరుణ నెల్లూరులోనే పరిచయమైంది. వారి వ్యాపార అవసరాలకు అరుణను, ఆమె గ్యాంగ్‌ను వాడుకున్నట్లు పోలీసుల అనుమానం.

సూళ్లూరుపేటలో చోటా గ్యాంగ్‌..

2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచీ అరుణ సూళ్లూరుపేటకు రాకపోకలు పెంచింది. అక్కడ ఎంపీపీ అనిల్‌కుమార్‌ రెడ్డి కార్యాలయంలో మకాం వేసేది. అక్కడ పది మంది రౌడీలతో గ్యాంగ్‌ను నడిపినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో అరుణ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


చెప్పింది వినలేదని కేసు పెట్టించింది!

‘గంజాయి వ్యాపారం చేయండి.. వ్యభిచార కేంద్రం నిర్వహించండి.. అన్నీ నేను చూసుకుంటా’’ అంటూ అరుణ జారీ చేసిన ఆదేశాలు పాటించనందుకు తనను కేసులో ఇరికించారని ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతడి పేరు రాయపు శ్రీనివాసులు. నాయుడుపేట మండలం విన్నమాల గ్రామవాసి. అతడి కథనం మేరకు... వెంకటగిరి ప్రాంతానికి చెందిన భాగ్యరాజు... శ్రీనివాసులకు బంధువు. భాగ్యరాజు అరుణను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అరుణతో శ్రీనివాసులుకు పరిచయం ఏర్పడింది. గంజాయి సరఫరా చేస్తానని, వ్యభిచార కేంద్రం నిర్వహించాలని.. ఏదైనా తేడా వస్తే తాను చూసుకుంటానని శ్రీనివాసులుకు ఆమె ఆఫర్‌ ఇచ్చింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇలాంటి వాటిలోకి రాలేనని చెప్పడంతో అతడిపై కక్ష పెంచుకుంది. పడుగుపాడులో రాజ్యలక్ష్మి అనే మహిళతో వివాదం తలెత్తడంతో అరుణ ఆమె ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టింది. రాజ్యలక్ష్మి, ఆమె భర్తతోపాటు శ్రీనివాసులుపైనా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణా జరపకుండానే ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇన్నాళ్లూ భయంతో నోరుమెదపని శ్రీనివాసులు... సోమవారం పోలీసులకు అరుణపై ఫిర్యాదు చేశాడు.

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌కు నోటీసు

ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ, రౌడీషీటర్‌ అవిలేల శ్రీకాంత్‌కు నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌ నోటీసు జారీ చేశారు. నెల్లూరు జైలులో ఉన్నప్పుడు శ్రీకాంత్‌ను వైద్యం నిమిత్తం తిరుపతి ఆస్పత్రిగా పంపగా కి‘లేడీ’ అరుణతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో శ్రీకాంత్‌కు నోటీసు పంపారని విశాఖ జైలు సూపరింటెండెంట్‌ సాయిపవన్‌ తెలిపారు.

Updated Date - Aug 26 , 2025 | 09:38 AM