Sanskrit University: ఇద్దరు సంస్కృత వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్టు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:17 AM
తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ లక్ష్మణకుమార్, డాక్టర్ శేఖర్‌రెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ లక్ష్మణకుమార్, డాక్టర్ శేఖర్‌రెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి నుంచి వాగ్మూలం నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారిగా నియమితులైన తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారించారు. మరోవైపు తిరుపతి వెస్ట్ సీఐ మురళీమోహన్, అలిపిరి ఎస్‌ఐ అజిత, మరో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు రెండు రోజుల కిందట ఒడిశా వెళ్లి బాధితురాలి వద్ద వాగ్మూలం రికార్డు చేశారు.
నిందితులపై కఠినచర్యలకు మహిళా కమిషన్ ఆదేశం
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఈడీ విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తిరుపతి ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.