High Court: అరెస్టు సమయంలో..సివిల్ దుస్తులా
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:29 AM
నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులు యూనిఫాం ధరించకపోవడాన్ని హైకోర్టు తప్పపట్టింది. సాధారణ దుస్తుల్లో వచ్చి వ్యక్తులను అరెస్టు చేసే సంస్కృతి ఎక్కడిదని ప్రశ్నించింది.
సుప్రీం మార్గదర్శకాలు మీకు వర్తించవా?
పోలీసులను నిలదీసిన హైకోర్టు
సవేంద్రరెడ్డి అరెస్టు వాస్తవాల నిర్ధారణకు పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను మా ముందుంచండి
పోలీసులకు ధర్మాసనం ఆదేశం
విచారణ రేపటికి వాయిదా
నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని నిర్దేశం
26న తమ ముందు హాజరుకావాలని సవేంద్రరెడ్డికి ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులు యూనిఫాం ధరించకపోవడాన్ని హైకోర్టు తప్పపట్టింది. సాధారణ దుస్తుల్లో వచ్చి వ్యక్తులను అరెస్టు చేసే సంస్కృతి ఎక్కడిదని ప్రశ్నించింది. నేరగాళ్లను అరెస్టు చేసే సమయంలో పోలీసులు యూనిఫాం ధరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేసింది. వైసీపీ నేత సవేంద్రరెడ్డి అరెస్టు సమయంలో యూనిఫాం ఎందుకు ధరించలేదని ప్రత్తిపాడు సీఐని ప్రశ్నించింది. గంజాయి విక్రయిస్తున్న సవేంద్రరెడ్డిని ట్రాప్ చేసి పట్టుకున్నామని, పోలీసు దుస్తుల్లో వెళ్తే నిందితుడు పట్టుబడే అవకాశం లేదన్న సీఐ వివరణతో విభేదించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మీకు వర్తించవా అని ప్రశ్నించింది. కనీసం ఒక్క అధికారినైనా యూనిఫాంతో దూరంగా ఉంచాల్సిందని వ్యాఖ్యానించింది. కిడ్నాప్ చేశారని ఫిర్యాదు వస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా.. జనరల్ డైరీలో ఎంట్రీ చేయడం ఏమిటని తాడేపల్లి పోలీసులను నిలదీసింది. ఈ నెల 22న రాత్రి 7.30 నుంచి 8.45 మధ్య సవేంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రత్తిపాడు పోలీసులు చెబుతున్నారని.. మరోవైపు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆ రోజు రాత్రి 7 గంటలకే తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని సవేంద్రరెడ్డి భార్య అయిన పిటిషనర్ చెబుతున్నారని గుర్తుచేసింది. వాస్తవాలను తేల్చేందుకు ఈ నెల 22న సాయంత్రం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను తమ ముందుంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశించింది.
అలాగే ఆ రోజు సవేంద్రరెడ్డి ఫోన్ టవర్ లొకేషన్‌ను గుర్తించి వివరాలను తమ ముందుంచాలని జియో టెలికామ్ సంస్థకు స్పష్టం చేసింది. నిందితుడు సవేందర్‌రెడ్డిని శుక్రవారం వరకు స్వేచ్ఛగా వదిలేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ రోజు తిరిగి తమ ముందు హాజరుకావాలని నిందితుడికి స్పష్టం చేసింది. పిటిషన్‌పై విచారణను శుక్రవారాని(26)కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.