ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:43 PM
ప్రధానమంత్రి గురువారం పర్యటన సందర్బంగా నన్నూరు రాగమయూరి గ్రీనహిల్స్ వద్ద పనులు పకడ్బందీగా పూర్తి చేశారు.
జాతీయ రహదారుల వెంట కళకళలాడుతున్న ఆయా పార్టీల జెండాలు
సభా ప్రాంగణం సమీపంలో భారీ కటౌట్లు
ఓర్వకల్లు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి గురువారం పర్యటన సందర్బంగా నన్నూరు రాగమయూరి గ్రీనహిల్స్ వద్ద పనులు పకడ్బందీగా పూర్తి చేశారు. రోడ్లు, కంప చెట్లు తొలగించడం, పార్కింగ్, రహదారులు తదితర పనులు పూర్తయ్యాయి. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రజలకు భోజన సౌకర్యం, తాగునీరు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. రాగమయూరి పరిసర ప్రాంతాల్లో ఆయా పార్టీల జెండాలతో రాగమయూరి కళకళలాడుతున్నాయి. టోల్ ప్లాజా నుంచి పున్నమి రెస్టారెంటు వరకు రహదారిపై ఆయా పార్టీల జెండాలు ఏర్పాటు చేశారు. అలాగే రాగమయూరి పరిసర ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్, మంత్రి నారా లోకేశ ఫొటోలతో పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆయా కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన మంత్రి ఓర్వకల్లు విమానాశ్రయానికి రానుండడంతో ఆ పరిసర ప్రాంతాలను, కంపచెట్లను తొలగించి శుభ్రపరిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.