Bank Robbery Attempt: ఖాతా తెరవాలని వచ్చి.. తుపాకులతో బెదిరించి
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:57 AM
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో గురువారం మధ్యాహ్నం కొందరు ఆగంతకులు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు.
సినీ ఫక్కీలో బ్యాంకు దోపిడీకి యత్నం.. మేనేజర్, సిబ్బంది అప్రమత్తం
అలారం మోగించడంతో ఆగంతకుల పరారీ.. మొత్తం ఏడుగురు..
బ్యాంకులోకి ఐదుగురు.. అనకాపల్లి కెనరా బ్యాంకులో ఘటన
అనకాపల్లి టౌన్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో గురువారం మధ్యాహ్నం కొందరు ఆగంతకులు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులైన ఖాతాదారుల కథనం మేరకు.. గురువారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో రింగురోడ్డు ప్రాంతంలోని కెనరా బ్యాంకులోకి తొలుత ఓ ఆగంతకుడు ప్రవేశించి మహిళా ఉద్యోగిని వద్దకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయాలని కోరాడు. సమయం పడుతుందని ఆమె చెప్పడంతో వెనుతిరిగి వచ్చేశాడు. తర్వాత మరో ఇద్దరు బ్యాంకు లోపలికి వెళ్లి అంతా పరిశీలించసాగారు. పది నిమిషాల తర్వాత మరో ముగ్గురు ప్రవేశించారు. వారిలో ఒకడు తుపాకీతో బెదిరిస్తూ.. క్యాషియర్ చొక్కా కాలర్ పట్టుకున్నాడు. మరో ఇద్దరు దుండగులు బ్యాంకు మేనేజర్ సౌజన్య చాంబర్లోకి చొరబడి తుపాకీ చూపించి బెదిరించారు. ఆమెను బయటికి లాక్కురాబోయారు. ఆమె బిగ్గరగా కేకలు వేసి టేబుల్‌పై ఉన్న అలారాన్ని మోగించారు. దీంతో ఆగంతకులు పరారయ్యారు. బయటున్న మరో ఇద్దరితో పాటు 3 ద్విచక్ర వాహనాలపై రైల్వేస్టేషన్ వైపు వేగంగా వెళ్లినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. వారికోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ ఎల్.మోహనరావు తెలిపారు.