NITI Aayog Report: అంతా పేదలేనా
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:18 AM
వివిధ రకాల గణాంకాలు, అధ్యయనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ‘డబుల్ డిజిట్ గ్రోత్’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.
ప్రగతి పరుగులో ‘బీద’ అరుపులేనా?
85 శాతం కుటుంబాలకు బియ్యం కార్డులు
రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న నీతీ ఆయోగ్
అయినా రేషన్ కార్డులు మాత్రం తగ్గేదే లేదు
రాష్ట్రంలో 10.50 లక్షలకు పైగా కార్లు
1.22 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు
రేషన్ కార్డుదారులు తినని బియ్యమంతా రీసేల్, ఇతర అవసరాలకే
సంక్షేమ పథకాలతో ముడిపెట్టడమే సమస్య
1.71 కోట్ల కుటుంబాల్లో 1.45 కోట్ల కుటుంబాలు ‘పేదవే’
రేషన్ బియ్యం వండుకుని తినే నిజమైన పేదలు 10 శాతమే
ఉచిత బియ్యంపై ఏటా రూ.15 వేల కోట్ల వ్యయం
వీరంతా పేదలా?
2022 సామాజిక సర్వే ప్రకారం
రాష్ట్రంలో మొబైల్ యూజర్లు : 8.2 కోట్లు
(రెండేసి సిమ్‌లు వాడుతున్న వారు కోట్లలోనే)
ద్విచక్రవాహనాలు : 1,22,56,669
కార్లు: 10,56,891.. జీపులు : 10,615
2024-25లో ఐటీ రిటర్న్స్ వేసిన వారు: 30.76 లక్షలు
(ఏ ఆదాయమూ లేకుండా రిటర్న్స్ వేసే వాళ్లు చాలా చాలా తక్కువ)
2024-25లో తలసరి ఆదాయం : 2.66 లక్షలు
(జాతీయ సగటు కంటే ఎక్కువ)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది! కానీ... రాష్ట్ర ప్రజల్లో మాత్రం పేదరికం పెరుగుతోంది! ‘తెల్లకార్డు’ ఉండటమే పేదరికానికి ప్రామాణికమైతే.... ఇదే నిజం! రేషన్ బియ్యం తిన్నా, తినకపోయినా... కార్డు మాత్రం ఉండాల్సిందే! అధికారిక రికార్డుల్లో ‘పేద’ ముద్ర పడాల్సిందే! ఇదో వింత పరిస్థితి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వివిధ రకాల గణాంకాలు, అధ్యయనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ‘డబుల్ డిజిట్ గ్రోత్’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. రాష్ట్రంలో 2015-16లో పేదరికం 11.77 శాతం ఉండగా, 2023 నాటికి అది 4.2 శాతానికి తగ్గిందని నీతీ ఆయోగ్-2023 నివేదికలో వెల్లడించింది. ఈ రెండేళ్లలో ఇంకా తగ్గే ఉంటుంది. పేదలు, పేదరికం తగ్గినప్పుడు... బియ్యం కార్డులూ తగ్గాలి కదా!? అది మాత్రం జరగదు.
పైగా రేషన్ కార్డులు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పేదల సంఖ్య పెరుగుతున్నట్లే కదా? మరి... నీతీ ఆయోగ్ నివేదికను నమ్మేదెలా? నీతీ ఆయోగ్ నివేదికే నిజమైతే... రేషన్ కార్డులు ఎందుకు తగ్గడంలేదు? ఒకప్పుడు మన రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యను మించి తెల్ల రేషన్ కార్డులు ఉండేవి! అదో రకం అరాచకం. బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు బినామీ పేర్లతో కార్డులు తీసుకునేవారు. ఇప్పుడు... బయో మెట్రిక్, ఈ-పోస్ యంత్రాల కారణంగా బినామీ కార్డుల సంఖ్య తగ్గింది. కానీ... అర్హత, అవసరంలేని వాళ్లూ కార్డులు తీసేసుకుంటున్నారు. అధికారిక అంచనా ప్రకారం... రాష్ట్ర జనాభా 5 కోట్లా 30 లక్షలు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.71 కోట్లు. మరి బియ్యం కార్డుల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్రంలో 1,45,97,486 రేషన్ కార్డులున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 85 శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నవే. 5.30 కోట్ల జనాభాలో దాదాపు 4.75 కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి. వీరిది రేషన్ బియ్యంపై ఆధారపడి జీవించేంత పేదరికమన్న మాట! ఇక... రాష్ట్రంలో బియ్యం కార్డుల్లేని కుటుంబాల సంఖ్య 26 లక్షలు! వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు, ఇతరులు! అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. వెరసి... ‘అధికారికం’గా ఆదాయంతో రికార్డులకు చిక్కే వారు మినహా... మిగిలిన కుటుంబాలన్నీ బియ్యం కార్డులు ఉన్నవే!
వేల కోట్లు వృథా...
ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కిలోల చొప్పున ప్రతి నెలా 2.30 లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. అదీ... ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పూర్తి ఉచితంగా! బియ్యం సేకరణ, సార్టెక్స్, ఫోర్టిఫికేషన్, స్టోరేజీ, రవాణా, డీలర్ కమీషన్... ఇలా కలిపి ఒక్క కిలో బియ్యం కోసం ప్రభుత్వం 48 రూపాయలు ఖర్చు చేస్తోంది. కేవలం రేషన్ బియ్యం పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా పెడుతున్న ఖర్చు దాదాపు రూ.15 వేల కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న వ్యయం దాదాపు రూ.7 వేల కోట్లు.
ఎందుకంత మోజు?
రేషన్ బియ్యం తినకున్నా కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే! ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికీ... ‘రేషన్ కార్డు’ కలిగి ఉండటమే అర్హత. ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి సామాజిక పింఛను, పక్కా ఇంటి దాకా... ఏదైనా సరే! రేషన్ కార్డు ఉన్న వారే అర్హులు. అందుకే... బియ్యం తినకున్నా, కార్డులు మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం వరుస ప్రభుత్వాలకూ తెలుసు. కానీ... అనర్హుల నుంచి కార్డులు ఏరివేసేందుకు మాత్రం ఎవరూ సాహసించరు. కారణం... విపక్షాలు రచ్చ చేస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయం! అందుకే... సంక్షేమ పథకాలకూ, రేషన్ కార్డుకూ మధ్య లింకు తెంచాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ... ఏ ప్రభుత్వమూ దీని గురించి ఆలోచించడంలేదు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ గ్రామంలో, ఏ వీధిలో ఎన్ని ఇళ్లున్నాయి, వారి ఆర్థిక స్థితిగతులేమిటి అనేది నిమిషాల్లో తెలుసుకునేంత నెట్‌వర్క్ ఉంది. ఇంత సమాచారం చేతిలో ఉంచుకుని కూడా రేషన్ బియ్యంపై ఏడాదికి రూ.15,000 కోట్లు వృథా చేస్తూనే ఉన్నారు.
ఎంత దుర్వినియోగం...
నిజంగా పేదల కడుపు నింపేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తప్పు లేదు. కానీ... అత్యంత దుర్వినియోగమవుతున్న లేదా వృథా అవుతున్న పథకం ఏదైనా ఉందంటే, అది ఉచిత బియ్యం పథకమే! ఒక అంచనా ప్రకారం... రేషన్ బియ్యం తీసుకుంటున్న వారిలో 10 శాతం మాత్రమే ఆ బియ్యాన్ని వండుకుని తింటున్నారు. అత్యధికులు బియ్యాన్ని ఇంటి దాకా కూడా తీసుకెళ్లరు. అక్కడికక్కడే డీలర్లకే ‘రీసేల్’ చేసేస్తారు. కిలోకు రూ.10 నుంచి 12 రూపాయలు పుచ్చుకుని జేబులో పెట్టుకుని వెళ్లిపోతారు. కొందరు ఇంట్లో దోసెల పిండి కోసం వాడుకుంటారు. ఇంకొందరు హోటళ్లు, దుకాణాలకు అమ్మేస్తారు. ఇదీ పరిస్థితి!
వీరు మాత్రమే అర్హులు...
బియ్యం కార్డు పొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలివి...
మాగాణి 3 ఎకరాల్లోపు, వర్షాధారమైతే 10 ఎకరాల్లోపు ఉండాలి. రెండూ కలిపి... పదెకరాలు దాటొద్దు.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండొద్దు.
విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటొద్దు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపు దారులు అనర్హులు.
సొంత కారు ఉన్న వారు రేషన్ కార్డు పొందేందుకు అర్హులు కారు. (ఎల్లో ప్లేట్ కారు ఉన్న వారు అర్హులే)