Share News

Employment Opportunities: మిట్టల్‌ స్టీల్‌కు లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:22 AM

రాష్ట్రంలో మరో భారీ ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రధాన అవరోధాలన్నీ తొలగిపోయాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లక్షన్నర కోట్ల పెట్టుబడితో ఏటా 8.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో...

Employment Opportunities: మిట్టల్‌ స్టీల్‌కు లైన్‌ క్లియర్‌

  • కర్మాగార నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు

  • నక్కపల్లిలో లక్షన్నర కోట్ల భారీ స్టీల్‌ ప్లాంట్‌

  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పక్కనే మరో భారీ ఉక్కు కర్మాగారం

  • లోకేశ్‌ చొరవ.. మోదీ సహకారంతో సాకారం

  • ఈ నెల 14న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు తొలిరోజే భూమి పూజ

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో భారీ ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రధాన అవరోధాలన్నీ తొలగిపోయాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లక్షన్నర కోట్ల పెట్టుబడితో ఏటా 8.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ‘ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్స్‌’కు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈఏసీ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇంతకాలం స్టీల్‌ ప్లాంట్‌ అంటే విశాఖలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ మాత్రమే ల్యాండ్‌ మార్క్‌గా ఉండేది. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ పేరెత్తితే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఆర్సెలార్‌-నిప్పన్‌ స్టీల్స్‌ గుర్తుకు రానుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని ప్రధాన నగరం విశాఖ కేంద్రంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గుర్తుకు వస్తోంది. గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలన్నీ ఇప్పటికే వరుసలో నిలబడ్డాయి. తాజాగా లక్షన్నర కోట్ల పెట్టుబడితో దిగ్గజ ఉక్కు పరిశ్రమ కూడా జత కలిసింది.


లోకేశ్‌ ప్రకటన నిజం చేస్తూ..

గత నెల 14వ తేదీన ఢిల్లీ వేదికగా రూ.1.33,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ స్థాపనపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌ సమక్షంలో గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద సమయంలోనే, రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య ప్రకంపనలు ప్రారంభమయ్యాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. నవంబరు నెలలో వరుసగా ప్రపంచస్థాయి సంస్థలతో ఒప్పందాలు, శంకుస్థాపనలు ఉంటాయంటూ లోకేశ్‌ వెల్లడించారు. ఈ మాటలు నిజం చేస్తూ ఈ నెల తొలిరోజునే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్స్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం గమనార్హం.


గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌.. భారీగా ఉద్యోగాలు..

రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించే ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రధాన అవరోధం తొలగిపోవడంతో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్పు సందర్భంగా తొలిరోజే (14న) భూమి పూజ నిర్వహించేందుకు ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్స్‌ సన్నద్ధమైంది. గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌గా పరిశ్రమను నిర్మించనున్నారు. ప్రారంభంలో ఏటా 8.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించి, చివరికి ఏటా 24 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి కార్మాగారం చేరుకుంటుంది. ఈ ప్లాంట్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం వల్ల పర్యావరణానికి హాని చేకూర్చే దుమ్మూ ధూళి ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. కార్మాగారం చుట్టూ వేలాది ఎకరాల్లో చెట్లను పెంచుతారు. పరిశ్రమ నిర్మాణం పూర్తయితే, రాష్ట్ర ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో మిట్టల్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. అనుబంధంగా ఉక్కు ఆధారిత అవుట్‌పుట్‌ పరిశ్రమలూ రానున్నాయి.

ప్రధాని మోదీ చొరవ.. గనుల కేటాయింపు

గత ఏడాది ఆగస్టులో మంత్రి నారా లోకేశ్‌ అర్సెలర్‌ మిట్టల్‌తో సంప్రదింపులు ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు ఆర్సెలార్‌ మిట్టల్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పరిశ్రమ సజావుగా నడిచేందుకు, నష్టాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తమకు ప్రత్యేకంగా ఖనిజ నిక్షేపాలు కావాలని ఆర్సెలార్‌ మిట్టల్‌ స్పష్టం చేసింది.ఈ డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి లోకేశ్‌ తీసుకువెళ్లారు. ఆర్సెలార్‌ ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు వివరించారు. వెంటనే స్పందించిన ప్రధాని మోదీ కేంద్ర గనుల మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడారు. మిట్టల్‌కు ప్రత్యేకంగా ముడి సరుకు లభించేలా గనులను కేటాయించారు. దీంతో ఆ సంస్థ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చింది.

Updated Date - Nov 02 , 2025 | 04:25 AM